
వాళ్లపై నిషేధం మంచిది కాదు: నటి దీపికా
పాకిస్తాన్ నటీనటులపై నిషేధం విధించాలని భావించడం, చాలా మంది ఈ నిర్ణయంపై తమ వైఖరిని వెల్లడించడం చూస్తూనే ఉన్నాం. అయితే దాయాది దేశ నటీనటులపై నిషేధం విధించాలన్న ఆలోచన చాలా చెడ్డ నిర్ణయమేనని బాలీవుడ్ నటి దీపికా కాకర్ అభిప్రాయపడింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నంత మాత్రాన ఆర్టిస్టులపై ఇలాంటి చర్యలు తీసుకోవద్దని ఆమె సూచించింది. బుల్లితెరపై 'ససురాల్ సిమర్ కా'తో నటనకుగానూ ఆమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. మూవీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లను బ్యాన్ చేసినంత మాత్రాన సమస్యలు తొలగిపోతాయా అని ప్రశ్నించింది.
పాక్ కు చెందిన ఆర్టిస్టులు వారి దేశానికి వెళ్లిపోవాలని రెండు రోజుల కిందట మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) హెచ్చరించింది. 48 గంటల్లో పాక్ వెళ్లిపోతే వారికే మంచిదని ఎంఎన్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. దాయాది దేశానికి చెందిన ఆర్టిస్టులు నటించిన బాలీవుడ్ సినిమాలను విడుదల కానిచ్చే ప్రసక్తేలేదని ఆ పార్టీ నేతలు స్పష్టంచేశారు. ఏ దిల్ హై ముష్కిల్, రేయిస్ మూవీలలో పాక్ నటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ నటించారని.. అందుకు మూవీ యూనిట్ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. ఎంటర్ టైన్ మెంట్ రంగాలపైనా ఇలాంటి నిషేధం అనే పదాలు వాడరాదని దీపికా కాకర్ చెప్పుకొచ్చింది. ఇటీవల పాక్ ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్ లో జరిపిన ఉడీ ఉగ్రదాడిలో 18 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.