పాటిల్ వ్యాఖ్యలతో దుమారం
దెబ్బకు క్షమాపణ చెప్పిన మాజీ మంత్రి
ముంబై: ఎమ్మెన్నెస్ అభ్యర్థిపై అత్యాచారానికి సంబంధించి ఎన్సీపీ నాయకుడు, మాజీ హోం మంత్రి ఆర్‌ఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. సాంగ్లిలో తన మద్దతుదారులతో పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి కారణమయ్యాయి. కార్యకర్తలతో ఆయన సంభాషణ ఇలా సాగింది.
‘‘ఈరోజు ఎమ్మెన్నెస్ కార్యకర్తలు నా వద్దకు వచ్చి నాకు మద్దతునిస్తామని చెప్పారు. ఎందుకు మీరు నాకు మద్దతునిస్తున్నారు అని వారిని అడిగాను. మా అభ్యర్థి జైలుకెళ్లాడని వారు చెప్పారు. ఏం మంచి పని చేసి అతడు జైలుకెళ్లాడు అని నేను వారిని అడిగాను. అతనిపై ఓ రేప్ కేసు నమోదైంది అని వారు చెప్పారు. శాసనసభ్యునిగా ఎన్నిక కావాలనుకున్న వాడు ఎన్నికలైన తరువాత రేప్ చేయవచ్చు కదా అని నేను చెప్పాను’’
వివాదాలకు కొత్తకాని పాటిల్ చేసిన ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో 26/11 సంఘటన జరిగినప్పుడు ‘‘పెద్ద నగరాల్లో ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు సాధారణమే’’ అన్నారు. ఆ తరువాత శక్తీమిల్ కాంపౌండ్‌లో మహిళా పాత్రికేయురాలిపై అత్యాచారం జరిగినప్పుడు, ‘‘జర్నలిస్టులందరికీ నేను రక్షణనివ్వాలా?’’ అని ప్రశ్నించారు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆయన మరింత గడుసుగా వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
పాటిల్ ఓ ‘జోక్’ అని బీజేపీ నాయకురాలు షైనా ఎన్‌సీ పేర్కొన్నారు. అతనికి మనస్సాక్షి లేదని, ప్రజా జీవితంలో ఉండే అర్హత కూడా లేదని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం నేర్పాలని షైనా కోరారు. పాటిల్‌పై సెక్షన్ 107 కింద కేసు నమోదు చేయాలని సామాజిక కార్యకర్త, న్యాయవాది అభా సింగ్ సూచించారు. అత్యాచారాలు చేసేలా పురికొల్పినందుకు అతనిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 26/11 సమయంలో చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
క్షమించండి : పాటిల్
తన వ్యాఖ్యలపై పలు వర్గాల నుంచి ఆగ్రహం వెల్లువెత్తుతోందని తెలుసుకున్న పాటిల్ వెంటనే ప్రమాద నివారణచర్యలను చేపట్టారు. తన ప్రత్యర్థిపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశానని, దీని ద్వారా ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. ఎమ్మెన్నెస్ అభ్యర్థి సుధాకర్ ఖాడేపై 2007లో కూడా ఒక రేప్ కేసు నమోదైందని, ఇప్పుడు నామినేషన్ వేసిన వెంటనే అత్యాచారం కేసులో జైలుకెళ్లాడని అన్నారు. అంతకుముందు ఆయుధాల చట్టం, వేధింపులపై కూడా అభియోగాలు నమోదయ్యాయని చెప్పారు. తన వ్యాఖ్యలను వింటే అవి సందర్భోచితమేనని అంగీకరిస్తారని సమర్థించుకున్నారు. తాను మహిళలను కించపరిచే ప్రశ్నేలేదని అన్నారు. తాను హోం మంత్రిగా పని చేసిన కాలంలో మహిళల భద్రత కోసం ఎన్నో చర్యలు చేపట్టానని చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసేలా ఉంటే, వారికి క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు.