సీఎం సమక్షంలో సినిమా వివాదానికి తెర!
ముంబై: రొమాంటిక్ సినిమా విషయంలో కొద్ది రోజులుగా కొనసాగిన సస్సెన్స్ థ్రిల్లర్ ఎట్టకేలకు ముగిసింది. సినిమా విడుదల కావాలంటే సెన్సార్ బోర్డు అనుమతి తప్పనిసరి. కానీ ఓ సినిమా మాత్రం సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వానిధేత, ఒక పార్టీ నేతల అనుమతితో విడుదలవుతోంది. భారతీయ సినిమా రంగంలో కీలక పరిణామంగా భావిస్తోన్న ఈ ఒప్పందానికి సీఎం అధికారిక నివాసం వేదికైంది.
ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసంలో శనివారం ఉదయం జరిగిన కీలక భేటీలో.. కరణ్ జోహార్ దర్శకనిర్మాతగా రూపొందించిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదలకు అంగీకారం కుదిరింది. సినిమా విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే, సినిమా విడుదల కోసం పాట్లు పడుతోన్న కరణ్ జోహార్ తోపాటు నిర్మాతల సంఘం అధ్యక్షుడు ముఖేష్ భట్ లు భేటీలో పాల్గొన్నారు. సినిమా ప్రారంభానికి ముందు ఉడీఉగ్రదాడిలో చనిపోయిన అమరజవాన్లకు నివాళులు అర్పిస్తూ ప్రకటన ఇవ్వడం, భవిష్యత్తులో తీయబోయే సినిమాల్లో పాకిస్థానీ నటీనటులను తీసుకోకపోవడం' అని రెండు డిమాండ్లకు దర్శకనిర్మాత తలొగ్గడంతో 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలకు లైన్ క్లియర్ అయింది. (రెచ్చిపోయిన ఐశ్వర్య రాయ్..)
సినిమా విడుదలను అడ్డుకోవద్దని, ఒకవేళ ఎవరైనా ఆ పనిచేస్తే తాటతీస్తామని సీఎం ఫడ్నవిస్ ఇంతకుముందే ప్రకటించారు. అయితే ఎంఎన్ఎస్ ఒత్తిడి మేరకు ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులు ఆ సినిమాను ప్రదర్శించేందుకు నిరాకరించారు. దీంతో చర్చలు అనివార్యం అయ్యాయి. డీల్ కుదిరిన పిమ్మట బయటికి వచ్చిన రాజ్ ఠాక్రే.. సినిమా విడుదలకు సహకరిస్తామని చెప్పారు. కరణ్ జోహార్ తరఫున ముఖేఖ్ భట్ మాట్లాడుతూ.. 'ఏ దిల్ హై ముష్కిల్ లో 300 మంది భారతీయులు పనిచేశారని, పాకిస్థానీ నటుడు ఫవద్ ఖాన్ ఆఫ్ట్రాల్ నాలుగు నిమిషాలు కనిపిస్తాడని, అయినాసరే సీఎంకు ఇచ్చిన రెండు హామీలను నిలబెట్టుకుంటామని చెప్పారు. (హీరోహీరోయిన్ల స్టన్నింగ్ ఫొటో)
ఆందోళన మొదలైందిలా..
కశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై సెప్టెంబర్ 18న పాకిస్థానీ ఉగ్రవాదులు దాడిచేయడం, 19 మంది జవాన్లను పొట్టనపెట్టుకోవడం తెలసిందే. నాటి దాడిని ప్రపంచమంతా తీవ్రంగా ఖండించింది. బాలీవుడ్ ప్రముఖులు కూడా పాకిస్థాన్ తీరుపై భగ్గుమన్నారు. అయితే బాలీవుడ్ లో పనిచేస్తోన్న పాకిస్థానీ నటీనటులు మాత్రం ఉడీపై నోరు మెదపలేదు. దీంతో పాక్ యాక్టర్లను బహిష్కరించాలని ఎంఎన్ఎస్ ఆందోళనలు ప్రారంభించింది. స్థానబలం వల్ల క్రమంగా ఆ ఆందోళనలకు మద్దతు లభించింది. మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లోని నిర్మాతల మండళ్లు, ఎగ్జిబిటర్లు పాక్ నటులున్న సినిమాలను ప్రదర్శించబోమని తేల్చిచెప్పారు. అప్పటికే తాను తీసిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదల తేదీని ప్రకటించిన కరణ్ జోహార్ కు ఎంఎన్ఎస్ నిర్ణయం శరాఘాతంలా మారింది.
తనకు దేశం ముఖ్యమని, పరిస్థితులు మరోలా ఉన్నప్పుడు తీసిన సినిమాను ఇప్పుడు అడ్డుకోవడం తగదని కరణ్ జోహార్ పలు వేదికల నుంచి ఎంఎన్ఎస్ ను వేడుకున్నాడు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను సైతం కలిసి సహాయాన్ని ఆర్థించాడు. చివరికి మహారాష్ట్ర సీఎం సమక్షంలో ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, రణ్ బీర్ కపూర్, అనుష్క శర్మ, ఫవద్ ఖాన్ లు ప్రధాన తారగణం. 'బాద్ షా' షారూఖ్ ఖాన్ కూడా తళుక్కున మెరవనున్నారు. ప్రీతం చక్రవర్తి సంగీతం అందిస్తున్నారు. యధావిథిగా దీపావళి కానుకగా అక్టోబర్ 28న 'ఏ దిల్ హై ముష్కిల్' ప్రేక్షకుల ముందుకు రానుంది.