సినిమా వాళ్ల బలవంతపు విరాళాలు మాకొద్దు
సినిమా వాళ్ల బలవంతపు విరాళాలు మాకొద్దు
Published Sat, Oct 22 2016 6:14 PM | Last Updated on Tue, Oct 2 2018 8:44 PM
బాలీవుడ్ సినిమా ఏ దిల్ హై ముష్కిల్ విడుదల విషయంలో నెలకొన్న రాజకీయాల్లోకి తమను అనవసరంగా లాగొద్దని సైన్యం తేల్చిచెప్పింది. పాక్ నటీనటులను సినిమాలో పెట్టుకున్నందుకు గాను సైన్యం సహాయనిధికి రూ. 5 కోట్ల విరాళం ఇవ్వాలంటూ నిర్మాతలకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన చేసిన డిమాండు సహేతుకం కాదని చెప్పింది. ఈ విషయమై పలువురు సైన్యాధికారులు తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఆర్మీ ఎప్పుడూ నిధుల కోసం వాళ్ల దగ్గరకు, వీళ్ల దగ్గరకు వెళ్లదని.. సినిమా నిర్మాతలు ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చుగానీ ఇలా బలవంతంగా ఇప్పించకూడదని అన్నారు. ఆర్మీని రాజకీయాలకు దూరంగా ఉంచాలని చెప్పారు.
ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలను తాము అడ్డుకోబోమంటూ ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు సినిమాకు ఆటంకాలు కొంతవరకు తగ్గినట్లే కనిపించాయి. అయితే సినిమా థియేటర్ల సంఘాల వాళ్లు మాత్రం.. దీన్ని తాము ప్రదర్శించేది లేదని చెబుతున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో జరిగిన సమావేశంలో.. ముందుగా సైన్యం సహాయ నిధికి రూ. 5 కోట్లు ఇవ్వాలని ఎంఎన్ఎస్ డిమాండు చేయగా, దానికి నిర్మాతలు అంగీకరించారు. మామూలుగా ఎవరు ఏం ఇవ్వాలనుకున్నా సరేగానీ, ఇలా బలవంతంగా ఇప్పించిన డబ్బును తాము స్వీకరించేది లేదని ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
జాతి సెంటిమెంట్లను ఇలా వాడుకోకూడదని.. ఏదైనా తప్పయితే దాన్ని తప్పనే అనాలి తప్ప బలవంతంగా రూ. 5 కోట్లు విరాళం ఇప్పించినంత మాత్రాన తప్పు ఒప్పయిపోదని కార్గిల్ యుద్ధ హీరో బ్రిగేడియర్ కుషాల్ ఠాకూర్ (రిటైర్డ్) అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్మీ పేరును వాడుకోకూడదన్నదే తమ అభిప్రాయమన్నారు. యుద్ధంలో మరణించినవాళ్ల కుటుంబాల సంక్షేమం కోసం ఇటీవలే ఆర్మీ ఓ బ్యాంకు ఖాతా తెరిచింది. తాము విరాళాలు ఇస్తామంటూ పలు సంస్థలు, పలువురు వ్యక్తులు రక్షణ మంత్రిత్వశాఖను సంప్రదించిన తర్వాత ఈ ఖాతా తెరిచారు.
Advertisement
Advertisement