
మీ ఆత్మాహుతి బాంబర్లను పాక్ పంపండి
పాకిస్థాన్‌కు చెందిన నటీనటులంతా 48 గంటల్లోగా భారతదేశాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చేసిన హెచ్చరికలపై సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర ఎమ్మెల్యే అబూ అజ్మీ స్పందించారు. దమ్ముంటే రాజ్ ఠాక్రే తన ఆత్మాహుతి బాంబర్లను పాకిస్థాన్‌లోని లాహోర్, కరాచీ నగరాలకు పంపాలని సవాలుచేశారు. పాకిస్థాన్ తన ఆత్మాహుతి దళాలను భారత్ పంపుతోందని, దానికి ప్రతీకారంగా కావలంటే మీ వాళ్లను పాక్ పంపాలని తెలిపారు. అంతేతప్ప చట్టబద్ధంగా భారతదేశ వీసా తీసుకుని ఇక్కడకు వచ్చేవారిని భయపెట్టొద్దని తెలిపారు. దానివల్ల మీ ఓటుబ్యాంకే దెబ్బతింటుందని అన్నారు.
పాకిస్థాన్ విషయం పక్కన పెడితే.. మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రాపూర్ లాంటి ప్రాంతాల్లో నక్సలైట్లు పోలీసులపై దాడులు చేస్తున్నారని.. ముందుగా పార్టీ కార్యకర్తలను పంపి ఆ పోలీసులను రక్షించాలని అబూ అజ్మీ అన్నారు. పాకిస్థానీ ఉగ్రవాదులు మన 18 మంది జవాన్లను హతమార్చిన మాట నిజమేనని, దానిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటూ అంతమాత్రాన అక్కడి నుంచి వచ్చే కళాకారులు, క్రీడాకారులను భయపెట్టడం సరికాదన్నారు. రాజ్‌ఠాక్రేకు దమ్ముంటే ఢిల్లీ వెళ్లి పాకిస్థాన్ రాయబార కార్యాలయాన్ని మూసేయాలని, అలాగే పాకిస్థాన్‌లోని భారత ఎంబసీకి వెళ్లి ఆ దేశం వాళ్లకు ఇక్కడి వీసాలు ఇవ్వకుండా చూడాలని తెలిపారు.