
థాక్రేపై ఎస్పీ నేత సంచలన వ్యాఖ్యలు
ముంబై: ఉరి ఉగ్ర దాడి నేపథ్యంలో బాలీవుడ్‌లోని పాకిస్థాన్ నటులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) హెచ్చరికలపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) స్పందించింది. దీనిపై ఎస్పీ మహారాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అబు ఆజ్మీ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి వీసాలతో చట్టబద్ధంగా వచ్చే వారిని భయపెట్టడం కాదని, దమ్ముంటే లాహోర్, కరాచీలకు ఆత్మాహుతి దళాలను పంపించాలని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రేకు సవాలు విసిరారు.
పాకిస్తాన్ నుంచి అధికారికంగా భారతదేశం వచ్చే ప్రజలను భయపెట్టడానికి బదులుగా లాహోర్, కరాచీ ఆత్మాహుతి బాంబర్లను పంపండి. పాక్ మన దేశానికి ఆత్మాహుతి బృందాలను భారతదేశానికి పంపుతోంది. మీకు దమ్ముంటే, దేశంపై సానుభూతి , ప్రేమ ఉంటే ఇపుడు మీరు కూడా మీ ఆత్మాహుతి బాంబర్లను లాహోర్, పాకిస్థాన్ కు వ్యతిరేకంగా పోరాడటానికి పంపాలనీ, అంతేకానీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని రాజ్‌థాక్రేకు అబు అజ్మీ పేర్కొన్నారు. పాకిస్థాన మాట పక్కన పెట్టి...మహారాష్ట్ర సంగతి చూడమంటూ ఘాటుగా స్పందించారు. పాకిస్థాన్ దాకా ఎందుకు? గడ్చిరోలి, చంద్రాపూర్‌లో నక్సల్స్ పోలీసులపై దాడులకు దిగుతున్నారు. కనీసం అక్కడికైనా మీ కార్యకర్తలను పంపించి భద్రతా దళాలను రక్షించండి. అప్పుడు మీరు దేశం కోసం పాకులాడుతున్నట్టు తాను అర్థం చేసుకుంటానంటే అబు అజ్మి విరుచుకుపడ్డారు.
మరోవైపు థాక్రే వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకులు విక్రమ్ భట్, హన్సల్ మెహతా స్పందించారు. క్రికెటర్లను, కళాకారులను టార్గెట్ చేయడం సరికాదని విక్రం పీటీఐకి చెప్పారు. దాడులకు , కళాకారులకు సంబంధం ఏమిటంటూ మరో దర్శకుడు హన్సల్ మెహతా ట్విట్టర్ ద్వారా తన నిరసనను వ్యక్తం చేశారు. కాగా పాకిస్తాన్ నుండి నటులు మరియు కళాకారులు 48 గంటల్లో భారతదేశం విడిచి పోవాలని.. లేదంటే తామే మెడపట్టి గెంటేస్తామని ఎంఎన్ఎస్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
MNS for next central govt. In one master stroke they have solved the India Pakistan problem. After all it is artistes who provoke attacks.
— Hansal Mehta (@mehtahansal) 23 September 2016