ముంబైని అమ్మేస్తే ఒప్పుకోం: రాజ్ ఠాక్రే
ముంబై: అభివృద్ధి పేరిట ముంబైని ఇంచుఇంచుకు అమ్ముతున్నారని మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ అధినేత రాజ్ఠాక్రే బీజేపీపై విమర్శలు గుప్పించారు. భవిష్యత్తులో మహారాష్ట్రీయులకు స్వరాష్ట్రంలోనే ప్రతీది ఖరీదైనదిగా మారే ప్రమాదం ఉందని, పెట్టుబడిదారులకోసం అభివృద్ధి పేరిట ముంబైలోని ప్రతి అంగుళాన్ని అమ్మేస్తున్నారని, దీనిని మనం ఏమాత్రం అంగీకరించవద్దంటూ పార్టీ నేతలకు, ప్రజలకు సూచించారు. ముంబై బృహత్తర ప్రణాళిక అంటూ తీసుకొచ్చారని, దీనిని కొందరు చాలా గొప్పదని అంటుంటే మరికొందరు చెత్తబుట్టల్లో వేయాల్సినదని అంటున్నారని చెప్పారు. తాను మాత్రం పూర్తిగా అది ఫలవంతం కానిదని అంటున్నానని అన్నారు. ప్రజల ప్రయోజనాలను పక్కకు పెట్టి ప్రభుత్వం చేసే ఏ పనులను అంగీకరించబోమని తెలిపారు.