సాక్షి, ముంబై : లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలంటే మద్యం దుకాణాలను తెరవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఎమ్‌ఎన్‌ఎస్పీ చీఫ్ రాజ్ ఠాక్రే సలహా ఇచ్చారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో రాష్ట్ర ఆదాయం పెద్ద ఎత్తున పడిపోయిందని, మద్యం అమ్మకాల ద్వారా దానిని పూడ్చవచ్చని సూచించారు. రాష్ట్రంలో వైన్ షాపులను తెరిస్తే రోజుకు రూ. 42 కోట్లు, నెలకు 1250 కోట్లు, ఏడాదికి రూ. 14000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఉద్ధవ్‌కు రాజ్ ఠాక్రే గురువారం ఓ లేఖ రాశారు. (24 గంటల్లో 1409 పాజిటివ్ కేసులు)
వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ఎప్పటి వరకు కొనసాగుతుందో చెప్పలేమన్నారు. ఇది ఇలానే కొనసాగితే ముందుముందు రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వనరులన్నీ మూసుకుపోవడంతో సంక్షేమ పథకాలకు ఇబ్బందులు ఏర్పడొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఖజానాను పెంచుకోవాలంటే మద్యం అమ్మకాలకు వెసులుబాటు కల్పించాలని సీఎంకు సూచించారు. లాక్‌డౌన్ ఆంక్షలను కొనసాగిస్తూనే.. సామాజిక దూరం పాటిస్తూ వీటిని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. వీటి ద్వారం వచ్చిన మొత్తాన్ని సంక్షేమ పథకాలు, కరోనా బాధితులకు ఉపయోగించవచ్చని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. (లాక్‌డౌన్ నుంచి పలు షాపులకు మినహాయింపులు)
కాగా దేశ వ్యాప్తింగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రంలోని వెలుగుచూసిన విషయం తెలిసిందే. గురువారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 5,221 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యారు. ఇప్పటి వరకు 251 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు వైరస్ నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి రావడంలేదు. ఇక ధారావిలాంటి మురికివాడలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం అధికారులును, ప్రభుత్వాన్ని తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment