ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. పెద్ద పెద్ద పార్టీలు తమ తమ అభ్యర్థులను ఇంకా ఎంపిక చేసుకోవాల్సి ఉంది.
పుణే: ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. పెద్ద పెద్ద పార్టీలు తమ తమ అభ్యర్థులను ఇంకా ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఏదిఏమైనప్పటికీ వారంలోగా పుణే లోక్‌సభ నియోజకవర్గానికి ఏ పార్టీ తరఫున ఎవరు బరిలోకి దిగనున్నారనే విషయం దాదాపు ఓ కొలిక్కివచ్చే అవకాశముంది. 1999దాకా పుణే లోక్‌సభ నియోజక వ ర్గంలో ద్విముఖ పోటీ జరిగింది. అయితే ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరిగింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి గండిపడింది. తత్ఫలితంగా ఈ స్థానంలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది.
పది సంవత్సరాల తర్వాత ఎన్నికల స్వరూపమే మారిపోయింది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)లతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలోకి దిగారు. అయినప్పటికీ ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక ప్రస్తుతం రాజకీయ పరిణామాలు పూర్తిగా నాటకీయంగా మారిపోయాయి. జాతీయస్థాయిలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అదే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్). ఈ పార్టీ ఈ నియోజకవర్గంలోనూ కొంతమేర ప్రభావం చూసే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఈ నియోజక వర్గానికి జరిగే ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, ఎమ్మెన్నెస్, ఆప్ పార్టీలు పోటీపడే అవకాశముంది. ఆప్ ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించింది.
మిగతా పార్టీలు అభ్యర్థుల అన్వేషణలో తలమునకలయ్యాయి. కాగా కామన్వెల్త్ క్రీడాకుంభకోణంలో స్థానిక ఎంపీ సురేశ్‌కల్మాడీ ప్రమేయముందనే ఆరోపణల నేపథ్యంలో ఈ నియోజక వర్గానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకుంది. అవినీతిని తన రాజకీయ ప్రచారాస్త్రంగా ఆప్ ఎంచుకుంది. ఈ దిశగానే ప్రచారపర్వాన్ని కొనసాగిస్తోంది. తద్వారా స్థానిక కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసింది. ఇక బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీ నగరశాఖలో కుమ్ములాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ పార్టీ తన అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు.
అన్నింటికంటే ముందు ఆప్
ఇతర రాజకీయ పక్షాల కంటే ఎన్నికల విషయంలో ఆప్ పరుగులు తీస్తోంది. ఎన్నికలకు ముందుగానే ఈ పార్టీ భారీ కసరత్తే చేసింది. ఇతర పార్టీలు అడుగు వేయకముందే తన అభ్యర్థిని ప్రకటించేసింది. ఈ విషయమై ఆ పార్టీ అభ్యర్థి సుభాష్ వారే మీడియాతో మాట్లాడుతూ ‘మా పార్టీకి నగరవాసులనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మార్పు ఆశిస్తున్నారనే విషయం వారి ముఖాల్లో స్పష్టంగా గోచరిస్తోంది. నగరాభివృద్ధి అంశాన్ని ప్రచారాస్త్రంగా మలచుకుని ముందుకు సాగుతున్నాం’ అని అన్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ నెల ఒకటో తేదీన ‘ఝాడూ యాత్ర’ నిర్వహించామన్నారు. కాగా గురువారం ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ‘లోక్‌సభా సమితి’ పేరిట ఆప్ ఓ కమిటీని నియమించింది. ఈ సమితిలోని సభ్యులు ఎన్నికల బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.
బీజేపీ నగరశాఖ కలహాలమయం
ఇక బీజేపీ నగరశాఖ కలహాలమయంగా మారింది. ఎన్నికల షెడ్యూలు వెలువడిన మరుసటి రోజున ఎంపీ సీటు తమకంటే తమకు దక్కుతుందంటూ ఆ పార్టీ నాయకులు అనిల్ శిరోలే, గిరీష్ బాపట్ ప్రకటించారు. ఇదిలాఉంచితే గోపీనాథ్ ముండే, నితిన్ గడ్కరీ వర్గాల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఇది పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడొకరు మాట్లాడుతూ 2009లోనూ ఈ వర్గాల వల్లే పార్టీ విజయావకాశాలు దెబ్బతిన్నాయన్నారు.