
ముంబయి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్‌ఠాక్రే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరేల్ రోడ్, ఎల్ఫిన్‌స్టన్ రోడ్డు రైల్వే స్టేషన్లను కలిపే పాదచారుల వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జ్)పై భారీ తొక్కిసలాటను వివిధ కారణాలు చూపించి తప్పించుకోవాలని చూడొద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందు మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసే వరకు బుల్లెట్ రైలుకోసం ఒక్క ఇటుక పేర్చనీయం అని హెచ్చరించారు.
వర్షాలు ఇప్పుడే కొత్తగా రావడం లేదని, వర్షాల వల్లే తొక్కిసలాట జరిగిందని, అటు కేంద్ర రైల్వే శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ముంబయి రైల్వేలో జరిగిన ప్రమాదాల జాబితాను అక్టోబర్ 5న అందిస్తామని, ఆ రోజు వారికి డెడ్‌లైన్ కూడా పెడతామని, అప్పటికీ తమ ఆందోళనను పట్టించుకోకుండా తర్వాత సంగతి తాము చూసుకుంటామని తెలిపారు.