మీ చరిత్ర అందరికీ తెలుసు
♦ రాజ్‌ఠాక్రేపై మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే ఫైర్
♦ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేస్తారో ప్రజలకు
♦ తెలుసని ఎద్దేవా ‘అవినీతి’ పై ఆధారాలుంటే
♦ విచారణకు సిద్ధమని వ్యాఖ్య
ముంబై : 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడి యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై విమర్శలు చేసిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే చరిత్ర ఎవరికుందో రాష్ట్ర ప్రజలకందిరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ‘వివాదాలు ృసష్టించే చరిత్ర ఎవరికుందో రాష్ట్ర ప్రజలకందిరికీ తెలుసు. బీజేపీ ఎన్నడూ ఇలాంటి వాటికి మద్దతునివ్వలేదు. ఎందుకంటే మా పార్టీ శాంతిని కోరుకుంటుంది కాబట్టి’ అని ఖడ్సే అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకపోవడం, అలా చేసే వారిని ప్రోత్సహించకపోవడమే బీజేపీ వైఖరికి నిదర్శనం అని అన్నారు.
కొద్ది రోజుల కిందట థానేలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్‌ఠాక్రే మాట్లాడుతూ, ‘కేంద్ర రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వం.. యాకూబ్ మెమన్ ఉరితీతను డ్రామా చేసింది. మలుపులు తిప్పుతూ చివరికి ఉరితీశారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ దేశంలో అలర్లు జరగాలని కోరుకుంటుందేమో’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అవినీతిలో కూరుకుపోయిందని, గత కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదని విమర్శించారు. దీనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఖడ్సే, ‘ఎమ్మెన్నెస్‌ను సవాల్ చేస్తున్నా. దమ్ముంటే అవినీతి జరిగిందని ఆధారాలు చూపించండి.
అంతేగాని చౌకబారు విమర్శలు చేస్తే మాత్రం ఊరుకోం. ఒక బాధ్యత గల పౌరుడిగా అవినీతికి పాల్పడిన వ్యక్తుల పేర్లను ఆధారాలతో సహా రాజ్ ఠాక్రే వెల్లడించాలి. మేం విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఘాటుగా స్పందించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత తమ పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపేందుకు ఆయన ఇలా చౌకబారు ఆరోపణలు చేస్నే తామేం చేయలేమని ఏక్‌నాథ్ ఖడ్సే ఎద్దేవా చేశారు.