మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను పోలీసులు చెంబూరు వద్ద బుధవారం అరెస్ట్ చేశారు. టోల్ విధానంలో పారదర్శకత తీసుకు రావాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెన్నెస్ రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో చేపట్టిన విషయం తెలిసిందే. రాస్తారోకోలో పాల్గొనేందుకు బయల్దేరిన రాజ్ ఠాక్రేను పోలీసులు మధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. బలవంతపు అరెస్ట్లతో తాము వెనక్కి అడుగు వేసేది లేదని ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే అన్నారు. ఆయన అరెస్ట్ సందర్భంగా కార్యకర్తలు పోలీసుల్ని అడ్డుకోవటంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలించారు.