పోటీకి రాజ్ దూరం
సాక్షి, ముంబై: వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. నాగపూర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి రాజ్‌ఠాక్రే హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని నియోజకవర్గాలన్నీ తనవేనని, ప్రస్తుతం వాటిపై దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
నాసిక్ లేదా ముంబైలో ఏదో ఒక శాసనసభ నియోజక వర్గం నుంచి పోటీచేస్తానని రెండు నెలల కిందట ఠాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే. కచ్చితంగా ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. దీంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయమై ఇటు ప్రజల్లో, అటు ఎమ్మెన్నెస్ కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. చివరకు తాను పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి ఆందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘నేను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా...? ఆ నియోజకవర్గానికే పరిమితమవుతాను.
అందుకే పోటీకి దూరంగా ఉంటున్నాను. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలూ నావే’ అని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఘోర పరాజయం తరువాత మే 31న మొదటిసారి బహిరంగా సభ ఏర్పాటుచేసి ప్రజల ముందుకు వచ్చారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించిన తరువాత వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీచేసి తన సత్తా ఏంటో నిరూపిస్తానని ప్రకటించారు.
దీంతో ఠాక్రే కుటుంబంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొదటి వ్యక్తి రాజ్ అంటూ వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో పోటీచేయడం లేదని తాజాగా ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘మా కుటుంబంలో ఇంతవరకు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇది మా ‘జన్యుపరమైన’ సమస్య’ అంటూ చమత్కరించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి అధికారం ఇస్తే మహారాష్ట్ర రూపురేఖలు మార్చివేస్తామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత తాము ఏం చేస్తామో తెలియజేసే మార్గదర్శక నివేదికను (బ్లూప్రింట్) వచ్చే వారం, పది రోజుల్లో విడుదల చేస్తామని ఈ సందర్భంగా రాజ్ స్పష్టం చేశారు. మొన్నటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధిని ప్రశంసించిన ఠాక్రే ఆదివారం మాత్రం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు.
ఇటీవల నాగపూర్‌లో మోడీ సభను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ బహిష్కరించడం సబబేనని అన్నారు. కార్యక్రమానికి ఆహ్వానించి, అవమానించడం సరికాదన్నారు. చివరగా రాజ్ మాట్లాడుతూ కేవలం తమకు అనుకూలంగా ఉన్న స్థానాల్లోనేగాక మొత్తం 288 శాసనసభ స్థానాల్లో ఎమ్మెన్నెస్ పోటీ చేస్తుందని ప్రకటించారు.