సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసిన ఖర్చుల వివరాలు చూపించాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రేకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. రాజ్ ఠాక్రేతో పాటు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభలకు ఏర్పాట్లు చేసిన ఆ పార్టీ నేతలు, పదాధికారులు, కార్యకర్తలు ఇబ్బందుల్లో పడిపోయారు.
ఇటీవల రాష్ట్రంలో మొత్తం 48 లోక్‌సభ నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ తరఫున ఒక్క అభ్యర్థి కూడా బరిలోకి దిగలేదు. అయినప్పటికీ ఆ పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ముంబైతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7–8 ప్రచార సభలు నిర్వహించి ఓటర్లలో బీజేపీకి వ్యతిరేకంగా వాతావరణం తయారుచేశారు. ఇది కాంగ్రెస్–ఎన్సీపీ మహాకూటమి ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా పరోక్షంగా ప్రచారం చేసినట్టైంది. సాధారణంగా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార సభలు, రోడ్ షోలు నిర్వహిస్తాయి. కానీ ఎమ్మెన్నెస్ నుంచి ఒక్క అభ్యర్థి కూడా బరిలో లేకపోయినా రాజ్‌ఠాక్రే ప్రచార సభలు నిర్వహించడమేంటని అప్పట్లో చర్చనీయంశమైంది.
నియమాల ప్రకారం రాజకీయ పార్టీలు చేసిన ప్రచార సభల ఖర్చులు తమ తమ అభ్యర్థుల ఖాతాలో వేస్తారు. ఆ తర్వాత ఖర్చుల జాబితా ఎన్నికల సంఘానికి సమర్పిస్తారు. కానీ రాజ్ ఠాక్రే ప్రచార సభల ఖర్చులు ఎవరి ఖాతాలో వేయాలనే అంశం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్ ఠాక్రే ఎన్నికల ప్రచారం ఖర్చులు కాంగ్రెస్–ఎన్సీపీ అభ్యర్థుల ఖాతాలో వేయాలని అప్పట్లో బీజేపీ అధికార ప్రతినిధి వినోద్ తావ్డే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ప్రచార సభలకు సంబంధించిన ఖర్చులు వెల్లడించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్ ఠాక్రేకు లేఖ రాసింది. దీనిపై రాజ్ ఏ విధంగా స్పందిస్తారనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment