EC notice
-
బీజేపీపైనా చర్యలు తీసుకోండి
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ ఆరోపణలపై బీజేపీ నేతలపైనా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మంత్రి అతిశి శనివారం ఎన్నికల కమిషన్(ఈసీ)ని డిమాండ్ చేశారు. బీజేపీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోందని శనివారం ఆమె మీడియా సమావేశంలో ఆరోపించారు. బీజేపీలో చేరడమో, ఈడీ అరెస్ట్‌ను ఎదుర్కోవడమో తేల్చుకోవాలంటూ ఆ పార్టీ నేత ఒకరు తనను బెదిరించారంటూ అతిశి చేసిన ఆరోపణలపై ఈసీ ఆమెకు శుక్రవారం నోటీసులిచి్చన విషయం తెలిసిందే. ‘మద్యం కుంభకోణంలో డబ్బు చేతులు మారిందనేందుకు ఎలాంటి ఆధారాలు దొరకనప్పటికీ కేవలం అనుమానంతోనే ఆప్ నేతలు సంజయ్ సింగ్, మనీశ్ సిసోడియా, సీఎం కేజ్రీవాల్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో నిందితుడొకరు బీజేపీకి కోట్లాది రూపాయలను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందజేసినట్లు ఆధారాలున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు’అని ఆమె ప్రశ్నించారు. -
ప్రజా శాంతి పార్టీ రద్దు కాలేదు: కేఏ పాల్
సాక్షి, హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ రద్దయిందని కొంత మంది ప్రచారం చేస్తున్నారని తమ పార్టీ రద్దు కాలేదని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఖండించారు. గురువారం సికింద్రాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో నగరంలోని వివిధ చర్చిలకు చెందిన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీకి కేవలం ఈసీ నోటీసులు మాత్రమే ఇచ్చిందని దానికి త్వరలోనే సమాధానం పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 2వ తేదీన శాంతి సమ్మిట్‌ను నగరంలో నిర్వహిస్తున్నామని కేసీఆర్ ఒక్క లేఖ ఇస్తే రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయలు తెప్పిస్తానని ఆయన అన్నారు. కేసీఆర్ ఫాం హౌస్‌లో 9 లక్షల కోట్ల డబ్బు, బంగారం దాచి ఉంచారని అందుకే అందులోకి ఎవరినీ పంపించరన్నారు. వేల పాటలు రాసి పాడిన గద్దర్‌కు భారతరత్న ఇవ్వాలన్నారు. గద్దర్ మాట్లాడుతూ మనుషులను ప్రేమించే మనిషే దైవమని అలాంటి వ్యక్తి యేసు క్రీస్తు అని అన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు రవికుమార్, శ్యామ్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్ ఠాక్రేకు ఈసీ నోటీసులు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసిన ఖర్చుల వివరాలు చూపించాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రేకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. రాజ్ ఠాక్రేతో పాటు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభలకు ఏర్పాట్లు చేసిన ఆ పార్టీ నేతలు, పదాధికారులు, కార్యకర్తలు ఇబ్బందుల్లో పడిపోయారు. ఇటీవల రాష్ట్రంలో మొత్తం 48 లోక్‌సభ నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ తరఫున ఒక్క అభ్యర్థి కూడా బరిలోకి దిగలేదు. అయినప్పటికీ ఆ పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ముంబైతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7–8 ప్రచార సభలు నిర్వహించి ఓటర్లలో బీజేపీకి వ్యతిరేకంగా వాతావరణం తయారుచేశారు. ఇది కాంగ్రెస్–ఎన్సీపీ మహాకూటమి ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా పరోక్షంగా ప్రచారం చేసినట్టైంది. సాధారణంగా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార సభలు, రోడ్ షోలు నిర్వహిస్తాయి. కానీ ఎమ్మెన్నెస్ నుంచి ఒక్క అభ్యర్థి కూడా బరిలో లేకపోయినా రాజ్‌ఠాక్రే ప్రచార సభలు నిర్వహించడమేంటని అప్పట్లో చర్చనీయంశమైంది. నియమాల ప్రకారం రాజకీయ పార్టీలు చేసిన ప్రచార సభల ఖర్చులు తమ తమ అభ్యర్థుల ఖాతాలో వేస్తారు. ఆ తర్వాత ఖర్చుల జాబితా ఎన్నికల సంఘానికి సమర్పిస్తారు. కానీ రాజ్ ఠాక్రే ప్రచార సభల ఖర్చులు ఎవరి ఖాతాలో వేయాలనే అంశం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్ ఠాక్రే ఎన్నికల ప్రచారం ఖర్చులు కాంగ్రెస్–ఎన్సీపీ అభ్యర్థుల ఖాతాలో వేయాలని అప్పట్లో బీజేపీ అధికార ప్రతినిధి వినోద్ తావ్డే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ప్రచార సభలకు సంబంధించిన ఖర్చులు వెల్లడించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్ ఠాక్రేకు లేఖ రాసింది. దీనిపై రాజ్ ఏ విధంగా స్పందిస్తారనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. -
ఆంధ్రజ్యోతికి ఈసీ నోటీసు
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలతో ఈ నెల 7న కర్నూలు జిల్లా టాబ్లాయిడ్లో ప్రచురించిన కథనానికి సమాధానం చెప్పాలంటూ ఆంధ్రజ్యోతి పత్రికకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మంగళవారం నోటీసు జారీ చేశారు. ‘ప్రతి నాయకుడు’ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం ప్రెస్ కౌన్సిల్, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నిర్ధారించింది. ప్రజాప్రాతినిథ్య చట్టం ఆర్పీ యాక్ట్ సెక్షన్ 127ను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ.. ఆంధ్రజ్యోతి యూనిట్ మేనేజర్‌కు కలెక్టర్ సత్యనారాయణ నోటీసు పంపించారు. ఈ కథనాన్ని పెయిడ్ న్యూస్‌గా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. -
రక్షణ మంత్రికి ఈసీ నోటీసులు
పనాజీ: కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు ఎన్నికల సంఘం బుధవారం షోకాజ్ నోటీసులు పంపింది. ఇటీవల గోవాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరింది. ఎన్నికల్లో బహిరంగసభలో ప్రచారం చేస్తూ పారికర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ నేతల నుంచి ఓటర్లు డబ్బులు తీసుకోవాలని చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 3వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఆ వ్యాఖ్యలు చేసినందకు మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని ఈసీ కోరింది. గత జవనరి 29న చింబెల్లో ప్రచారం చేసిన మనోహర్ పారికర్.. ఇతర పార్టీల నేతలతో డబ్బులు తీసుకున్నా ఎలాంటి సమస్య లేదన్నారు. ఎవరి వద్ద డబ్బులు తీసుకున్నా చివరికి మీ ఓటు బీజేపీకే వేయాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో నేతలు మరిన్ని డబ్బులు పంచుతారని పారికర్ అన్నారని గోవా ఫార్వర్డ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ముఖ్యమంత్రికి ఈసీ నోటీసులు
ప్రత్యర్థి పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకోండి గానీ.. ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే ఓటేయండి అంటూ ఓటర్లను ప్రలోభపెట్టినందుకు ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీచేసింది. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా ఆ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని, లేకపోతే ఆయనకు ఏమీ చెప్పకుండానే తదుపరి చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. కేజ్రీవాల్ కావాలనే ప్రజలను లంచాలు తీసుకుని ఓట్లేయాలంటూ రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ ఈ నోటీసు ఇచ్చింది. గోవా రాజధాని పణజిలో ఈనెల 8వ తేదీన జరిగిన బహిరంగ ర్యాలీలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఎన్నికలు జరగనున్న గోవాలో కేజ్రీవాల్ చేసిన ప్రసంగాలను ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పరిగణనలోకి తీసుకుని, ఈసీకి నివేదిక ఇచ్చి, తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ తరహా వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో లంచాలు తీసుకోవడాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని, ఇవి ప్రజాప్రాతినిధ్య చట్టంతోపాటు ఇండియన్ పీనల్కోడ్కు కూడా విరుద్ధమని ఈసీ పేర్కొంది. ప్రాథమికంగా కేజ్రీవాల్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిర్ణయించి నోటీసు ఇచ్చింది. అయితే, కేజ్రీవాల్‌కు ఈసీ నోటీసులు ఇవ్వడం ఇది మొదటిసారి ఏమీ కాదు. ఇంతకుముందు గత సంవత్సరం జనవరి 17న కూడా.. ఢిల్లీలో చర్చిల మీద దాడులు చేయించడం ద్వారా రాజధానిలో మత కల్లోలాలు రేకెత్తించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించినందుకు ఆయనకు ఈసీ నోటీసు ఇచ్చింది. అలాగే అదే సంవత్సరం జనవరి 21న రాజకీయ పార్టీల నుంచి లంచాలు తీసుకోండని ప్రజలకు చెప్పినందుకు మరోసారి నోటీసు ఇచ్చింది.