రక్షణ మంత్రికి ఈసీ నోటీసులు
పనాజీ: కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు ఎన్నికల సంఘం బుధవారం షోకాజ్ నోటీసులు పంపింది. ఇటీవల గోవాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరింది. ఎన్నికల్లో బహిరంగసభలో ప్రచారం చేస్తూ పారికర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ నేతల నుంచి ఓటర్లు డబ్బులు తీసుకోవాలని చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 3వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఆ వ్యాఖ్యలు చేసినందకు మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని ఈసీ కోరింది.
గత జవనరి 29న చింబెల్‌లో ప్రచారం చేసిన మనోహర్ పారికర్.. ఇతర పార్టీల నేతలతో డబ్బులు తీసుకున్నా ఎలాంటి సమస్య లేదన్నారు. ఎవరి వద్ద డబ్బులు తీసుకున్నా చివరికి మీ ఓటు బీజేపీకే వేయాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో నేతలు మరిన్ని డబ్బులు పంచుతారని పారికర్ అన్నారని గోవా ఫార్వర్డ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.