Goa Forward Party
-
గోవా మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ
పణజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శనివారం మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా కేబినెట్లో ఉన్న గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ)కి చెందిన ముగ్గురు, స్వతంత్ర అభ్యర్థి ఒకరికి ఉద్వాసన పలికారు. వీరి స్థానంలో ఇటీవల కాషాయ కండువా కప్పుకున్న కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేల్లో ముగ్గురికి పదవులు దక్కాయి. శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మృదులా సిన్హా.. చంద్రకాంత్ కవ్లేకర్, జెన్నిఫర్ మొన్సర్రెట్, ఫిలిప్ నెరి రొడ్రిగ్స్‌తోపాటు బీజేపీకి చెందిన మైఖేల్ లోబోతో ప్రమాణం చేయించారు. 2017 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి లేని సమయంలో మనోహర్ పారికర్ ప్రభుత్వం ఏర్పాటులో జీఎఫ్‌పీ కీలకంగా నిలిచింది. బీజేపీపై జీఎఫ్‌పీ విమర్శలు కేబినెట్ నుంచి తమను తప్పించడం ద్వారా బీజేపీ మోసానికి పాల్పడిందని జీఎఫ్‌పీ అధ్యక్షుడు, మంత్రివర్గం నుంచి వైదొలగిన డిప్యూటీ సీఎం విజయ్ సర్దేశాయ్ ఆరోపించారు. ఆయన శనివారం దివగంత సీఎం మనోహర్ పారికర్ మెమోరియల్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘పారికర్ రెండుసార్లు చనిపోయారు. భౌతికంగా మార్చి 17వ తేదీన ఒకసారి, రాజకీయ సిద్ధాంతాలను చంపడం ద్వారా నేడు మరోసారి’ అని వ్యాఖ్యానించారు. కాగా, జీఎఫ్‌పీ విమర్శలను సీఎం తోసిపుచ్చారు. -
అతిథి దేవోభవ మరిచారా మంత్రిగారూ?
పణజి : చిన్నప్పుడు అతిథి దేవోభవా అంటూ మాష్టారు నేర్పించిన పాఠాలను గోవా మినిస్టర్ మరిచిపోయినట్లున్నారు. అందుకేనేమో గోవాకు వచ్చే టూరిస్టులపై వివాదాస్పద ట్వీట్ చేశారు. ఎయిర్‌పోర్టు బయట నిద్రపోతున్న ప్రయాణికులను ఉద్దేశిస్తూ ఇలాంటి చీప్ టూరిస్టులు గోవాకు అవసరమా? మనకు ‘నాణ్యమైన’ వారు కావాలి. బ్రాండ్ గోవా ఇంత చీప్‌గా రాజీపడదని గోవా ఫార్వర్డ్ పార్టీ ఉపాధ్యక్షుడు కూడా అయిన దుర్గాదాస్ కమత్ గోవా ఎయిర్‌పోర్టు బయట బేస్మెంట్పై నిద్రిస్తున్న ప్రయాణికులను ఉద్దేశిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ‘ఒకసారి గోవా ఎయిర్‌పోర్టును చూడండి? ఇలాంటి చీప్ టూరిస్టులు మనకు అవసరమా? గోవా విమానాశ్రయం దీనిపై చర్య తీసుకోవాలి. గోవాను సందర్శించడానికి మాకు ఇలాంటి ధూళి, దుమ్ము అవసరం లేదు. మాకు నాణ్యమైన పర్యాటకులు కావాలి, వారే గోవా అందాలను ఆస్వాదిస్తారు. బ్రాండ్ గోవా ఏ ధరకైనా రాజీ పడదు’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ ఫోటోలో నిద్రిస్తున్న వారు పొద్దునే బయలుదేరే విమాన ప్రయాణికులు. ఎయిర్‌పోర్టులో సరైన సదుపాయాలు లేకపోవడంతో పాపం ఇలా బేస్‌మెంట్‌పైనే పడుకున్నారు. దుర్గాదాస్ ట్వీట్‌పై నెటిజనులు మండిపడ్డారు. మీకు గెస్ట్‌లు ధూళిలాగా కనిపిస్తున్నారా?. బ్రాండ్ గోవా అని మాట్లాడేకన్నా ముందు ఎయిర్‌పోర్టులో సరైన సౌకర్యాలు కల్పించండని ఒకరు ట్వీట్ చేయగా, ముందు గోవాకు ఆదాయం తీసుకొచ్చే టూరిస్టులను విమర్శించడం మానేసి బ్రాండ్ గోవా అని మీరు చెప్తున్న గోవాలో మాఫియాను అరికట్టడానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని మరొకరు ట్వీట్ చేశారు. ఇక మరో ట్విటర్ కాస్తా ఘాటుగా స్పందించాడు. గోవా గోవా వారికోసమే అనేది వారి పార్టీ సిద్ధాంతమని, భారతదేశంలో ఎక్కడికైనా ప్రయాణించే హక్కు రాజ్యాంగం మనకు ప్రసాదించిందని, ఇలాంటి వేర్పాటువాదులను తరిమికొట్టాలని పిలుపునిచ్చాడు. -
రక్షణ మంత్రికి ఈసీ నోటీసులు
పనాజీ: కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు ఎన్నికల సంఘం బుధవారం షోకాజ్ నోటీసులు పంపింది. ఇటీవల గోవాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరింది. ఎన్నికల్లో బహిరంగసభలో ప్రచారం చేస్తూ పారికర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ నేతల నుంచి ఓటర్లు డబ్బులు తీసుకోవాలని చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 3వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఆ వ్యాఖ్యలు చేసినందకు మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని ఈసీ కోరింది. గత జవనరి 29న చింబెల్లో ప్రచారం చేసిన మనోహర్ పారికర్.. ఇతర పార్టీల నేతలతో డబ్బులు తీసుకున్నా ఎలాంటి సమస్య లేదన్నారు. ఎవరి వద్ద డబ్బులు తీసుకున్నా చివరికి మీ ఓటు బీజేపీకే వేయాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో నేతలు మరిన్ని డబ్బులు పంచుతారని పారికర్ అన్నారని గోవా ఫార్వర్డ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
'గాడ్సే పుస్తకాన్ని రిలీజ్ చేస్తే ఒప్పుకోం'
పనాజి: నాధురాం గాడ్సే పేరిట రచించిన ఓ పుస్తకం విడుదల వివాదానికి దారి తీయనుంది. మహాత్మగాంధీ వర్థంతి రోజునే ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకోవడం కూడా ఆ వివాదానికి ఆజ్యం పోయనుంది. మహాత్మాగాంధీని నాధూరాం గాడ్సే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ గాడ్సేపైనే 'నాధురాం గాడ్సే-ది స్టోరీ ఆఫ్ యాన్ అస్సాసిన్' అనే పుస్తకం శనివారం విడుదలవుతోంది. దీనిని అనూప్ సర్దేశాయి రచించగా.. బీజేపీ నేత ఒకరు విడుదల చేస్తున్నారు. అదికూడా ప్రభుత్వం భవనం అయినటువంటి రవీంధ్ర భవన్లో. దీంతో ఈ పుస్తకాన్ని అసలు విడుదల చేయొద్దని డిమాండ్ చేస్తూ, విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ గోవాలో కొత్తగా ఏర్పాటయిన పార్టీ గోవా ఫార్వార్డ్ పార్టీ హెచ్చరిస్తోంది. రవీంధ్ర భవన్ ఎదుట తాము సత్యాగ్రహానికి దిగుతామని హెచ్చరిస్తోంది. తాము ఆ భవన్ వైపు వచ్చే మార్గాలన్నింటిని మూసివేస్తామని, ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరుకావొద్దని వారు సూచిస్తోంది.