పణజి : చిన్నప్పుడు అతిథి దేవోభవా అంటూ మాష్టారు నేర్పించిన పాఠాలను గోవా మినిస్టర్ మరిచిపోయినట్లున్నారు. అందుకేనేమో గోవాకు వచ్చే టూరిస్టులపై వివాదాస్పద ట్వీట్ చేశారు. ఎయిర్‌పోర్టు బయట నిద్రపోతున్న ప్రయాణికులను ఉద్దేశిస్తూ ఇలాంటి చీప్ టూరిస్టులు గోవాకు అవసరమా? మనకు ‘నాణ్యమైన’ వారు కావాలి. బ్రాండ్ గోవా ఇంత చీప్‌గా రాజీపడదని గోవా ఫార్వర్డ్ పార్టీ ఉపాధ్యక్షుడు కూడా అయిన దుర్గాదాస్ కమత్ గోవా ఎయిర్‌పోర్టు బయట బేస్‌మెంట్‌పై నిద్రిస్తున్న ప్రయాణికులను ఉద్దేశిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
‘ఒకసారి గోవా ఎయిర్‌పోర్టును చూడండి? ఇలాంటి చీప్ టూరిస్టులు మనకు అవసరమా? గోవా విమానాశ్రయం దీనిపై చర్య తీసుకోవాలి. గోవాను సందర్శించడానికి మాకు ఇలాంటి ధూళి, దుమ్ము అవసరం లేదు. మాకు నాణ్యమైన పర్యాటకులు కావాలి, వారే గోవా అందాలను ఆస్వాదిస్తారు. బ్రాండ్ గోవా ఏ ధరకైనా రాజీ పడదు’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ ఫోటోలో నిద్రిస్తున్న వారు పొద్దునే బయలుదేరే విమాన ప్రయాణికులు. ఎయిర్‌పోర్టులో సరైన సదుపాయాలు లేకపోవడంతో పాపం ఇలా బేస్‌మెంట్‌పైనే పడుకున్నారు.
దుర్గాదాస్ ట్వీట్‌పై నెటిజనులు మండిపడ్డారు. మీకు గెస్ట్‌లు ధూళిలాగా కనిపిస్తున్నారా?. బ్రాండ్ గోవా అని మాట్లాడేకన్నా ముందు ఎయిర్‌పోర్టులో సరైన సౌకర్యాలు కల్పించండని ఒకరు ట్వీట్ చేయగా, ముందు గోవాకు ఆదాయం తీసుకొచ్చే టూరిస్టులను విమర్శించడం మానేసి బ్రాండ్ గోవా అని మీరు చెప్తున్న గోవాలో మాఫియాను అరికట్టడానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని మరొకరు ట్వీట్ చేశారు. ఇక మరో ట్విటర్ కాస్తా ఘాటుగా స్పందించాడు. గోవా గోవా వారికోసమే అనేది వారి పార్టీ సిద్ధాంతమని, భారతదేశంలో ఎక్కడికైనా ప్రయాణించే హక్కు రాజ్యాంగం మనకు ప్రసాదించిందని, ఇలాంటి వేర్పాటువాదులను తరిమికొట్టాలని పిలుపునిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment