పణజి ఎయిర్‌పోర్ట్‌కొచ్చిన సీఎం సావంత్
పణజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శనివారం మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా కేబినెట్‌లో ఉన్న గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ)కి చెందిన ముగ్గురు, స్వతంత్ర అభ్యర్థి ఒకరికి ఉద్వాసన పలికారు. వీరి స్థానంలో ఇటీవల కాషాయ కండువా కప్పుకున్న కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేల్లో ముగ్గురికి పదవులు దక్కాయి. శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మృదులా సిన్హా.. చంద్రకాంత్ కవ్లేకర్, జెన్నిఫర్ మొన్సర్రెట్, ఫిలిప్ నెరి రొడ్రిగ్స్‌తోపాటు బీజేపీకి చెందిన మైఖేల్ లోబోతో ప్రమాణం చేయించారు. 2017 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి లేని సమయంలో మనోహర్ పారికర్ ప్రభుత్వం ఏర్పాటులో జీఎఫ్‌పీ కీలకంగా నిలిచింది.
బీజేపీపై జీఎఫ్‌పీ విమర్శలు
కేబినెట్ నుంచి తమను తప్పించడం ద్వారా బీజేపీ మోసానికి పాల్పడిందని జీఎఫ్‌పీ అధ్యక్షుడు, మంత్రివర్గం నుంచి వైదొలగిన డిప్యూటీ సీఎం విజయ్ సర్దేశాయ్ ఆరోపించారు. ఆయన శనివారం దివగంత సీఎం మనోహర్ పారికర్ మెమోరియల్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘పారికర్ రెండుసార్లు చనిపోయారు. భౌతికంగా మార్చి 17వ తేదీన ఒకసారి, రాజకీయ సిద్ధాంతాలను చంపడం ద్వారా నేడు మరోసారి’ అని వ్యాఖ్యానించారు. కాగా, జీఎఫ్‌పీ విమర్శలను సీఎం తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment