ఆంధ్రజ్యోతికి ఈసీ నోటీసు
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలతో ఈ నెల 7న కర్నూలు జిల్లా టాబ్లాయిడ్‌లో ప్రచురించిన కథనానికి సమాధానం చెప్పాలంటూ ఆంధ్రజ్యోతి పత్రికకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మంగళవారం నోటీసు జారీ చేశారు.
‘ప్రతి నాయకుడు’ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం ప్రెస్ కౌన్సిల్, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నిర్ధారించింది. ప్రజాప్రాతినిథ్య చట్టం ఆర్‌పీ యాక్ట్ సెక్షన్ 127ను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ.. ఆంధ్రజ్యోతి యూనిట్ మేనేజర్‌కు కలెక్టర్ సత్యనారాయణ నోటీసు పంపించారు. ఈ కథనాన్ని పెయిడ్ న్యూస్‌గా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.