ముఖ్యమంత్రికి ఈసీ నోటీసులు
ముఖ్యమంత్రికి ఈసీ నోటీసులు
Published Tue, Jan 17 2017 8:37 AM | Last Updated on Mon, Aug 20 2018 3:46 PM
ప్రత్యర్థి పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకోండి గానీ.. ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే ఓటేయండి అంటూ ఓటర్లను ప్రలోభపెట్టినందుకు ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీచేసింది. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా ఆ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని, లేకపోతే ఆయనకు ఏమీ చెప్పకుండానే తదుపరి చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. కేజ్రీవాల్ కావాలనే ప్రజలను లంచాలు తీసుకుని ఓట్లేయాలంటూ రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ ఈ నోటీసు ఇచ్చింది. గోవా రాజధాని పణజిలో ఈనెల 8వ తేదీన జరిగిన బహిరంగ ర్యాలీలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే ఎన్నికలు జరగనున్న గోవాలో కేజ్రీవాల్ చేసిన ప్రసంగాలను ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పరిగణనలోకి తీసుకుని, ఈసీకి నివేదిక ఇచ్చి, తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ తరహా వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో లంచాలు తీసుకోవడాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని, ఇవి ప్రజాప్రాతినిధ్య చట్టంతోపాటు ఇండియన్ పీనల్‌కోడ్‌కు కూడా విరుద్ధమని ఈసీ పేర్కొంది. ప్రాథమికంగా కేజ్రీవాల్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిర్ణయించి నోటీసు ఇచ్చింది.
అయితే, కేజ్రీవాల్‌కు ఈసీ నోటీసులు ఇవ్వడం ఇది మొదటిసారి ఏమీ కాదు. ఇంతకుముందు గత సంవత్సరం జనవరి 17న కూడా.. ఢిల్లీలో చర్చిల మీద దాడులు చేయించడం ద్వారా రాజధానిలో మత కల్లోలాలు రేకెత్తించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించినందుకు ఆయనకు ఈసీ నోటీసు ఇచ్చింది. అలాగే అదే సంవత్సరం జనవరి 21న రాజకీయ పార్టీల నుంచి లంచాలు తీసుకోండని ప్రజలకు చెప్పినందుకు మరోసారి నోటీసు ఇచ్చింది.
Advertisement