bribe comments
-
ఎన్నికలలో ఖాకీల పైసా వసూల్
సాక్షి, కర్నూలు: ఎన్నికలు ఓటర్లకే కాదు..పోలీసులకూ పండుగగా మారాయా? సహకారం పేరిట భారీగా వివిధ పార్టీల నేతల వద్ద మామూళ్లు తీసుకున్నారా? ఏకంగా ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి కోటి రూపాయలకుపైగా వసూలు చేశారా? అనే విచిత్ర ప్రశ్నలకు అంతే చిత్రంగా అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఎన్నికల సమయంలో స్టేషన్ల వారీగా పోలీసులు ఎంత మొత్తాన్ని వివిధ పార్టీల నుంచి తీసుకున్నారంటూ సేకరించిన వివరాల్లో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. జిల్లావ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు మొదలుకుని కానిస్టేబుళ్ల వరకూ వివిధ పార్టీ నేతల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వివరాలను పోలీసు ఉన్నతాధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కో స్టేషన్లో ఒక్కో కథ బయటకు వచ్చినట్టు సమాచారం. అయితే, బనగానపల్లె నియోజకవర్గంలో మాత్రం ఏకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నుంచి కోటి రూపాయల మేర తీసుకున్నట్టు తేలడంతో ఉన్నతాధికారులే నోరెళ్లబెట్టినట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలోని ప్రతీ స్టేషన్‌లోని పోలీసు సిబ్బందికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి నుంచి భారీగా నగదు ముట్టినట్టు విచారణలో తేలింది. అంతేకాకుండా ఎన్నికల సందర్భంగా కూడా ఇందుకు అనుగుణంగా సదరు అభ్యర్థికి సహకరించారు. వీరంతా ఎన్నికల ఫలితాల తర్వాత బాధపడినట్టు కూడా సమాచారం. ఇక జిల్లాల్లో కొన్ని మినహా మెజార్టీ స్టేషన్లలో ఈ మేరకు వసూళ్ల పర్వం నడిచినట్టు తేలింది. ఈ నివేదికను ఉన్నతాధికారులకు జిల్లా పోలీసు యంత్రాంగం రహస్యంగా అంజేసింది. ఇందుకు అనుగుణంగా సదరు అధికారులపై చర్యలుండే అవకాశం ఉందని కూడా పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్కడే అత్యధికం...! వాస్తవానికి ఎన్నికలు అంటేనే కోట్ల రూపాయలు డబ్బు వరదలా పారే పరిస్థితి నడుస్తోంది. అందులోనూ అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డంగా దోచుకున్న కోట్ల డబ్బును ఖర్చు చేసి అధికారంలోకి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఓటర్లతో పాటు పోలీసులకు కూడా భారీగా డబ్బును వెదజల్లారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పోలీసులు ఎంత మేర వసూలు చేశారన్న అంశంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఏయే డీఎస్సీ, సీఐ, ఎస్ఐలు ఎంత మేర వసూలు చేశారన్న అంశంపై ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారుల ద్వారా పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఇందులో ఆశ్చర్యకరంగా బనగానపల్లె నియోజకవర్గంలోని పోలీసు అధికారులు ఏకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి నుంచి ఏకంగా రూ.కోటి మేర మామూళ్లు తీసుకున్నట్టు తేలింది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల్లో కూడా విధులు సక్రమంగా నిర్వర్తించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ముగ్గురు డీఎస్పీలు మినహా మిగిలిన వారందరూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయడంతో పాటు తమ విధులను నిర్లక్ష్యం చేశారన్న నివేదికలు కూడా పోలీసు ఉన్నతాధికారులు చేరాయి. మొత్తం మీద ఎన్నికల ఫలితాల కంటే ఇప్పుడు ఈ వసూళ్ల ఫలితాలే పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయనడంలో అతిశయోక్తి లేదు. -
ముఖ్యమంత్రికి ఎన్నికల కమిషన్ నోటీసులు
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ఎన్నికల సంఘం నోటీసు జారీచేసింది. ఈనెల 4వ తేదీన భడోహిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకొని.. సమాజ్‌వాదీ పార్టీకి ఓటేయాలని అఖిలేష్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటర్లకు డబ్బులు ఇస్తున్నట్లు తనకు తెలిసిందని, ఆ డబ్బులన్నీ మీ వద్దే ఉంచుకుని సైకిల్ గుర్తుకు ఓటేయాలని అఖిలేష్ చెప్పారు. దాంతో ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా రుజువు కావడంతో ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఈనెల ఏడో తేదీలోగా సమాధానం ఇవ్వాలని అఖిలేష్ యాదవ్‌ను ఈసీ ఆదేశించింది. ఓటర్లను లంచం తీసుకోవాల్సిందిగా చెప్పడం కూడా నేరం కిందకు వస్తుందని కమిషన్ తెలిపింది. సీఎం వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు గోవాలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వివిధ పార్టీలు నిర్వహించే ఎన్నికల ర్యాలీలకు ప్రజలు వెళ్లడం, వాళ్లిచ్చే డబ్బులు తీసుకోవడంలో తప్పేమీ లేదని.. అయితే వాళ్లు మాత్రం బీజేపీకే ఓటు వేయాలని ఆయన చెప్పారు. గోవాలోనే నిర్వహించిన మరో కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఈసీ ఆదేశించింది. -
ముఖ్యమంత్రికి ఈసీ నోటీసులు
ప్రత్యర్థి పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకోండి గానీ.. ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే ఓటేయండి అంటూ ఓటర్లను ప్రలోభపెట్టినందుకు ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీచేసింది. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా ఆ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని, లేకపోతే ఆయనకు ఏమీ చెప్పకుండానే తదుపరి చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. కేజ్రీవాల్ కావాలనే ప్రజలను లంచాలు తీసుకుని ఓట్లేయాలంటూ రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ ఈ నోటీసు ఇచ్చింది. గోవా రాజధాని పణజిలో ఈనెల 8వ తేదీన జరిగిన బహిరంగ ర్యాలీలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఎన్నికలు జరగనున్న గోవాలో కేజ్రీవాల్ చేసిన ప్రసంగాలను ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పరిగణనలోకి తీసుకుని, ఈసీకి నివేదిక ఇచ్చి, తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ తరహా వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో లంచాలు తీసుకోవడాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని, ఇవి ప్రజాప్రాతినిధ్య చట్టంతోపాటు ఇండియన్ పీనల్కోడ్కు కూడా విరుద్ధమని ఈసీ పేర్కొంది. ప్రాథమికంగా కేజ్రీవాల్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిర్ణయించి నోటీసు ఇచ్చింది. అయితే, కేజ్రీవాల్‌కు ఈసీ నోటీసులు ఇవ్వడం ఇది మొదటిసారి ఏమీ కాదు. ఇంతకుముందు గత సంవత్సరం జనవరి 17న కూడా.. ఢిల్లీలో చర్చిల మీద దాడులు చేయించడం ద్వారా రాజధానిలో మత కల్లోలాలు రేకెత్తించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించినందుకు ఆయనకు ఈసీ నోటీసు ఇచ్చింది. అలాగే అదే సంవత్సరం జనవరి 21న రాజకీయ పార్టీల నుంచి లంచాలు తీసుకోండని ప్రజలకు చెప్పినందుకు మరోసారి నోటీసు ఇచ్చింది.