ముఖ్యమంత్రికి ఎన్నికల కమిషన్ నోటీసులు
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ఎన్నికల సంఘం నోటీసు జారీచేసింది. ఈనెల 4వ తేదీన భడోహిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకొని.. సమాజ్‌వాదీ పార్టీకి ఓటేయాలని అఖిలేష్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటర్లకు డబ్బులు ఇస్తున్నట్లు తనకు తెలిసిందని, ఆ డబ్బులన్నీ మీ వద్దే ఉంచుకుని సైకిల్ గుర్తుకు ఓటేయాలని అఖిలేష్ చెప్పారు. దాంతో ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా రుజువు కావడంతో ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఈనెల ఏడో తేదీలోగా సమాధానం ఇవ్వాలని అఖిలేష్ యాదవ్‌ను ఈసీ ఆదేశించింది.
ఓటర్లను లంచం తీసుకోవాల్సిందిగా చెప్పడం కూడా నేరం కిందకు వస్తుందని కమిషన్ తెలిపింది. సీఎం వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు గోవాలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వివిధ పార్టీలు నిర్వహించే ఎన్నికల ర్యాలీలకు ప్రజలు వెళ్లడం, వాళ్లిచ్చే డబ్బులు తీసుకోవడంలో తప్పేమీ లేదని.. అయితే వాళ్లు మాత్రం బీజేపీకే ఓటు వేయాలని ఆయన చెప్పారు. గోవాలోనే నిర్వహించిన మరో కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఈసీ ఆదేశించింది.