అవసరమైతే రాజ్‌ఠాక్రేపై చర్యలు: సీఎం
ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదల, ప్రదర్శన విషయంలో చట్టాన్ని ఉల్లంఘిస్తే.. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేపై చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆయన చెప్పారు. సెన్సార్ బోర్డు సినిమా విడుదలకు ఆమోదం తెలిపిందంటే.. ఇక ఎవరూ ఆ సినిమా విడుదలను అడ్డుకోవడానికి వీల్లేదని, చట్టాన్ని ఉల్లంఘించడానికి ఏ ఒక్కరినీ అనుమతించేది లేదని ఫడ్నవిస్ అన్నారు. రాజ్‌ఠాక్రే ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నాలు చేస్తే.. ఆయనపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సినిమా నిర్మాతలు తప్పనిసరిగా ఆర్మీ సహాయ నిధికి రూ. 5 కోట్ల విరాళం ఇవ్వాలన్న ప్రతిపాదనను తాను వ్యతిరేకించినట్లు సీఎం ఫడ్నవిస్ తెలిపారు. వాళ్లు కావాలంటే స్వచ్ఛందంగా ఇచ్చుకోవచ్చన్నారు. చట్టబద్ధంగా ఎవరైనా పాకిస్థానీ నటులు తగిన పత్రాలతో భారతదేశానికి వస్తే, వాళ్లకు తమ ప్రభుత్వం చట్టప్రకారం భద్రత కల్పిస్తుందని కూడా ఆయన తెలిపారు. కాగా, పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా.. విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంది. పలు ప్రాంతాల్లో ఎంఎన్ఎస్ కార్యకర్తలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు.