
ఠాక్రే భార్యపై కుక్క దాడి.. 65 కుట్లు!
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే భార్య షర్మిలను వాళ్ల పెంపుడు కుక్క దారుణంగా కరిచింది. షర్మిల ముఖం మీద ఆ కుక్క బాగా కరిచేయడంతో.. ఆమెను వెంటనే ముంబైలోని హిందూజా ఆస్పత్రికి తరలించి అక్కడ శస్త్రచికిత్స చేయించారు. ఆమెకు దాదాపు 65 కుట్లు పడ్డాయి.
రాజ్ ఠాక్రే కుటుంబం 'జేమ్స్', 'బాండ్' అనే రెండు కుక్కలను పెంచుకుంటోంది. వాటిలో బాండ్ అనే పెంపుడు కుక్క ఆమెపై దాడి చేసింది. ఇది గ్రేట్ డేన్ జాతికి చెందినది. రాజ్ ఠాక్రే తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. దాంతో ఆయన సమావేశం ముగియగానే ఆస్పత్రికి వెళ్లిపోయారు. బాండ్ అనే ఆ కుక్క షర్మిలను బాగా గట్టిగా కరిచిందని, దాని పళ్లు ఆమె ముఖం ఎముకల వరకు వెళ్లిపోయాయని వైద్యులు చెప్పారు. ఆమెకు బుగ్గల మీద ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది.