ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్లి నియోజకవర్గం నుంచి శివసేన తరపున పోటీ చేస్తున్న ఆదిత్య ఠాక్రేపై అభ్యర్థిని నిలబెట్టకూడదని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) భావిస్తోంది. కుమారుడి వరసయ్యే ఆదిత్యపై ఎవరినీ పోటీకి పెట్టరాదని ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే నిర్ణయించినట్టు సమాచారం. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆదిత్య ఠాక్రేపై పోటీ పెడితే ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్లే అవకాశముందని రాజ్ ఠాక్రే అభిప్రాయపడుతున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దీంతో వర్లిలో పోటీకి దూరంగా ఉండటమే మంచిదని ఆయన భావిస్తున్నారు. ‘వర్లి నుంచి ఈసారి నితిన్ నందగవాన్‌కర్, సంజయ్ ధురి పోటీకి ఆసక్తి చూపారు. కానీ తప్పుడు సంకేతాలు వెళ్లకూడదన్న ఉద్దేశంతో రాజ్ ఠాక్రే వీరిద్దకి ఎర్రజెండా చూపార’ని పార్టీ నాయకుడొకరు ఇండియా టుడే టీవీతో చెప్పారు. వర్లిలో పోటీపై ఎమ్మెన్నెస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
వర్లి నియోజకవర్గంలో ఎమ్మెన్నెస్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటు బ్యాంకు ఉంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 32 వేల ఓట్లు సాధించింది. 2014 నాటికి ఈ సంఖ్య 8 వేలకు పడిపోయింది. వర్లి స్థానాన్ని ఈసారి తమ మిత్రపక్షం పీపుల్స్ రిపబ్లికన్ అండ్ సోషలిస్ట్ పార్టీ (పీఆర్‌ఎస్‌పీ)కి ఎన్సీపీ కేటాయించింది. 2009లో ఇక్కడి నుంచి ఎన్సీపీ అభ్యర్థి సచిన్ అహిర్ గెలుపొందారు. 2014లో శివసేన అభ్యర్థి సుశీల్ షిండే గెలిచారు. సచిన్ అహిర్ ఇటీవల శివసేన పార్టీలో చేరారు. (చదవండి: శివసేన కొత్త వ్యూహం ఫలిస్తుందా?)
Comments
Please login to add a commentAdd a comment