ఆదిత్య ఠాక్రేకు తిరుగుండదా? | Worli Assembly: Aditya Thackeray Unanimously Elected! | Sakshi
Sakshi News home page

ఆదిత్య ఠాక్రేకు తిరుగుండదా?

Published Thu, Oct 3 2019 10:21 AM | Last Updated on Thu, Oct 3 2019 11:43 AM

Worli Assembly: Aditya Thackeray Unanimously Elected! - Sakshi

సాక్షి, ముంబై:  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో వాతావరణం వేడెక్కింది. వర్లీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న యువ సేన చీఫ్‌ ఆదిత్య ఠాక్రే ను ఏకగ్రీంగా ఎన్నికయ్యేందుకు భారీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందుకు వివిధ పార్టీల ప్రముఖులతో ఈ అంశంపై చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా  ఠాక్రే కుటుంబం నుంచి ఆదిత్య ఠాక్రే మొదటిసారి ఎన్నికల బరిలో దిగడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే శివసేనకు చెందిన సునీల్‌ షిందే కావడంతో వర్లీ నియోజక వర్గంలో మంచి పట్టు ఉంది. దీంతో ఆదిత్య ఠాక్రేను ఇక్కడి నుంచి బరిలో దింపాలని నిర్ణయం తీసుకున్నారు. గత అనేక దశాబ్ధాలుగా ఠాక్రే కుటుంబం ప్రభుత్వంలో ఎలాంటి పదవులు ఆశకుండా కేవలం పార్టీ పదవులకే పరిమితమైన సంగతి తెలిసిందే. 

అయితే ఆదిత్య మొదటిసారి ఎన్నికల బరిలో దిగడం, దీనికితోడు మంచి పట్టున్న వర్లీ అసెంబ్లీ నియోజక వర్గాన్ని ఎంపిక చేసుకోవడంతో ఇక విజయం తధ్యమని తెలుస్తోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌–ఎన్సీపీ మిత్రపక్షం లేదా వంచిత్‌ ఆఘాడి, ఎమ్మెన్నెస్‌ అభ్యర్ధులు పోటీ చేసినా ఆధిత్య ఠాక్రే కచ్చితంగా విజయకేతనం ఎగరవేస్తారనే నమ్మకం దాదాపు అందరిలో పాతుకుపోయింది.

పోటీదారులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. అందుకు వర్లీ నియోజక వర్గంలో అభ్యర్ధులను బరిలో దింపవద్దని కాంగ్రెస్‌–ఎన్సీపీ, వంచిత్‌ ఆఘాడి, ఎమ్మెన్నెస్‌ నాయకులతో సంప్రదింపులు జరిపేందుకు శివసేన నాయకులు నడుం బిగించారు. దీనిపై నామినేషన్ల దాఖలుకు చివరి రోజు, లేదా నామినేషన్ల ఉపసంహరణ రోజు అంటే ఏడో తేదీ లోపు ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు ఆదిత్య ఠాక్రేపై అభ్యర్థిని నిలబెట్టకూడదని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్‌) భావిస్తోంది. 

చదవండి:

శివసేన కొత్త వ్యూహం ఫలిస్తుందా?

ఆదిత్యపై పోటీకి రాజ్ వెనుకంజ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement