కాంగ్రెస్, ఎన్సీపీ (ప్రజాస్వామ్య) కూటమిని దెబ్బకొట్టాలంటే లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) పోటీ చేయదా?
సాక్షి, ముంబై: కాంగ్రెస్, ఎన్సీపీ (ప్రజాస్వామ్య) కూటమిని దెబ్బకొట్టాలంటే లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) పోటీ చేయదా?...ఆ పార్టీ అధినేత రాజ్‌ఠాక్రే కూడా అందుకు సుముఖంగానే ఉన్నారా?...బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి పరోక్షంగా సహకరించేందుకు అదే పార్టీకి చెందిన నితిన్ గడ్కారీకి ఏమైనా హామీ ఇచ్చారా?...ఒకవేళ బీజేపీ పోటీచేసే స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టకపోతే వారి పార్టీ కార్యకర్తలకు ఏమీ సమాధానం చెబుతారు?...ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఆదివారం ముంబైలో జరిగే పార్టీ ఎనిమిదో వార్షికోత్సవంలో దొరకనుంది. అదే రోజు తమ పార్టీ విధానాన్ని ఆయన ప్రకటించనున్నారు. రాజ్‌ఠాక్రే ఏమీ ప్రకటన చేస్తారా అని అటు పార్టీ కార్యకర్తలతో పాటు ఇతర రాజకీయ నాయకుల్లో జోరుగా చర్చ సాగుతోంది.
లోక్‌సభ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో రాజ్‌ఠాక్రే టోల్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం చవాన్‌తో భేటీ అయ్యారు. దీంతో టోల్‌పై ప్రత్యేకంగా ఒక పాలసీని ఏర్పాటు చేస్తామని చవాన్ రాజ్‌కు హామీ ఇచ్చారు. దీంతో ఆయన ఆందోళన విరమించారు. కానీ ప్రత్యక్షంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా ఆ పాలసీ మాత్రం ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. దీంతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే ఉత్తమమని రాజ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఓట్లు చీల్చడం వల్ల శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమి అధికారానికి దూరమైంది.
ఈసారి అలా జరగకుండా ఉండేందుకు బీజేపీ మాజీ అధ్యక్షుడు గడ్కారీ విజ్ఞప్తి మేరకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎమ్మెన్నెస్ కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొనే ప్రమాదం ఉంది. మోడీ, బీజేపీలకు పరోక్షంగా మద్దతిచ్చేందుకే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారనే ఆరోపణలు వస్తాయి. దీంతో రాజ్‌ఠాక్రే పరిస్థితి అడకత్తెరలో పోకలాగా మారి ంది. అయితే ఆరోపణలకు తావీయకుండా బీజేపీ పోటీచేస్తున్న నియోజకవర్గంలో బలహీన అభ్యర్థిని బరిలో దింపుతారా...? అసలు పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంటారా..? అనే విషయాలను ఆదివారం జరిగే సమావేశంలో తేల్చనున్నారు.
మరో కొత్తభాగస్వామి అవసరం లేదు: ముండే
‘మహా కూటమిలో ఇప్పటికే సీట్ల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే కూటమి బలంగా ఉంది. ఈ సమయంలో మరో కొత్త భాగస్వామిని చేర్చుకోవల్సిన అవసరం లేదనుకుంటున్నాన’ని బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే అన్నారు. రాజ్, గడ్కరీలు మంచి స్నేహితులని, తరచూ వాళ్లు కలుస్తుంటారని, శివసేన అధ్యక్షుడైన ఉద్ధవ్‌ఠాక్రే కూడా ఈ విషయం తెలుసని అన్నారు. పవార్‌ను వ్యక్తిగతంగా గౌరవిస్తానని, అయితే రాజకీయంగా మాత్రం వ్యతిరేకిస్తానని తేల్చిచెప్పారు. కాగా ఎమ్మెన్నెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేతో భేటీని బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ సమర్థించుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీ ఓట్లను చీల్చకుండా ఉంచే విషయమై ఆయనతో చర్చించానని మీడియాకు తెలిపారు. ఎన్‌డీఏ సభ్యుడిగా రాజ్‌ఠాక్రేను కలిశానని, ఒకవేళ లోక్‌సభ ఎన్నికలకు ఎమ్మెన్నెస్ అభ్యర్థులను బరిలోకి దింపితే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి లబ్ధి పొందే అవకాశముందన్నారు.