
సాక్షి,ముంబై: ఒకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టి కూడా ఇప్పుడ ఉపముఖ్యమంత్రి పదవిని పెద్దమనసుతో అంగీకరించిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అభినందించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. గతంలో ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరించి అందరికీ ఆదర్శంగా నిలిచారని ఫడ్నవీస్‌ను కొనియాడారు.
ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నవారైనా పార్టీ అధిష్టానం జారీ చేసిన ఆదేశాలను శిరసావహించాల్సిందేనని, ఈ విషయంలో ఫడ్నవీస్ ఏ మాత్రం భేషజాలు ప్రదర్శించకుండా అధిష్టానం ఆదేశాలను పాటించి మంచి వ్యక్తిత్వాన్ని చాటుకున్నారని అభినందించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి సమర్థవంతమైన పాలన అందించారని, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేశారని ఈ విషయంలో మీరు నిజంగా ప్రశంసనీయులని కొనియాడారు.
ఇప్పుడు మీకు లభించింది ప్రమోషనా లేక డీమోషనా అనేది ముఖ్యం కాదని, బాణాన్ని వదలాలంటే దారాన్ని గట్టిగా వెనక్కి లాగాలని, అప్పుడే ఆ బాణం ముందుకు దూసుకుపోతుందన్నారు. దారం వెనక్కి వెళ్లినంతమాత్రనా దాని విలువ తగ్గినట్లు కాదని ఉదహరించారు. ‘‘మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చారని, ప్రజలకు సేవ చేయడానికి మీకు మరోసారి అవకాశం లభించిందని, మీకు ఆయురారోగ్యాలను, శక్తిని ఆ జగదాంబ మాత ప్రసాదించాలని కోరుకుంటున్నా’’నని లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment