ముంబై: ‘మహా’ కూటమిలో ముసలం మొదలైంది. గత పదిహేన్నేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి చెక్ పెట్టాలని ఏకమైన శివసేన, బీజేపీ, ఆర్‌పీఐ పార్టీల్లో ఐక్యత కనబడటం లేదు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్ పనితీరును, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అవినీతి కుంభకోణాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లాల్సిన ఈ కూటమిలోని కొన్ని పార్టీలు అది ఆలోచించకుండా సీట్లు సాధించేందుకు ఏ పార్టీని తీసుకుంటే మంచిగుంటుందనే దానిపైనే దృష్టి కేంద్రీకరించింది.
ఇందులో భాగంగానే రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్)ను కూడా మహా కూటమిలోకి ఆహ్వానించాలన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌డీఏలోకి ఎమ్మెన్నెస్‌ను చేర్చుకోవాలన్న దానిపై రాజ్‌ఠాక్రేతో బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ముంబైలోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారని మీడియాలో వచ్చిన వార్తలు ఆ కూటమిలో కలకలం సృష్టించాయి.
ఒకవేళ వాళ్లు ఎమ్మెన్నెస్‌ను చేరదీయాలనుకుంటే మహా కూటమి పొత్తుపై ప్రభావం చూపుతుందని శివసేన పార్టీ తేల్చిచెప్పింది. మరోవైపు ఎమ్మెన్నెస్‌ను ఎన్‌డీఏలోకి తీసుకుంటే తనకెలాంటి అభ్యంతరం లేదని, స్వాగతిస్తానని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవలే స్పష్టం చేశారు. బీజేపీ మాత్రం బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఇలా మహా కూటమిలోని మూడు పార్టీలు భిన్నవాదనలు వినిపిస్తుండటం ఆ పార్టీల మధ్య అనైక్యతకు అద్దం పడుతోంది.
పొత్తుపై ప్రభావం ఉంటుంది: సంజయ్ రౌత్
రాజ్‌ఠాక్రేకు గానీ, పవార్‌కు గానీ బీజేపీ మద్దతు పలికితే ఆ ప్రభావం మహా కూటమిలోని పొత్తుపై ఉంటుందని శివసేన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ మంగళవారం విలేకరులకు తెలిపారు. రాష్ట్రంలోని మరాఠీ ఓటర్లందరూ తమ పార్టీతోనే ఉన్నారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మరాఠీయులందరూ శివసేనతోనే ఉన్నారని, వీరిని ఎవరూ తమ నుంచి వేరు చేయలేరని అన్నారు. రాష్ర్టంలోని 48 లోక్‌సభ స్థానాల్లోని బీజేపీ, శివసేన కూటమి గట్టి పోటీనిచ్చి 40 సీట్లను అలవోకగా గెలుచుకుంటుందన్న ధీమాను వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా గద్దె దించాలన్న విషయంపై రాజ్‌ఠాక్రేతో చర్చించానని బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ మీడియాకు తెలిపారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టొద్దని ఎమ్మెన్నెస్‌ను కోరినట్టు చెప్పారు. ఎమ్మెన్నెస్‌తో పొత్తుపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు.
ఉద్ధవ్‌ఠాక్రే అసంతృప్తి
బీజేపీ, ఎమ్మెన్నెస్ సంబంధాలపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం అర్ధరాత్రి తనను కలిసేందుకు మాతోశ్రీ బంగ్లాకి వచ్చిన రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ ముందు ఎమ్మెన్నెస్‌తో బీజేపీ వ్యవహర శైలిపై అగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిని ఓడించాలనే మాట్లాడే విషయంలో బీజేపీ నాయకుల మధ్య సమాచార లోపం ఉన్నట్టు కనబడుతోందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. పవార్, రాజ్‌ఠాక్రేలను ప్రశంసించకుండా ఉండలేరా అని ఆయన ప్రశ్నించారు.
సేనను స్వాగతిస్తాం: అథవలే
ఎన్‌డీఏతో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) పొత్తు పెట్టుకుంటే తనకెలాంటి ఇబ్బంది లేదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అథవలే అన్నారు. రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని పార్టీ వస్తే స్వాగతిస్తానని తెలిపారు. అయితే బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ, రాజ్‌ఠాక్రే రహస్యంగా సమావేశమయ్యారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో అథవలే వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
‘మహా’ కూటమిలో ముసలం
Published Tue, Mar 4 2014 10:38 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement