
'మహారాష్ట్ర నీ అయ్య జాగీర్ కాదు'
పట్నా: విద్వేషపూరిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రేకు లాలూ తనయుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర ఎవరి అయ్య జాగీర్ కాదని విషయాన్ని రాజ్ ఠాక్రే గుర్తిస్తే మంచిదని హితవు పలికారు. మహారాష్ట్రలో రాష్ట్రేతరులు ఆటోరిక్షా పర్మిట్ తీసుకుంటే.. వారి ఆటోలను తగలబెట్టాలని రాజ్ ఠాక్రే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఠాక్రే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన తేజస్వి 'మహారాష్ట్రకానీ, ఈ దేశం కానీ ఎవడి అబ్బ సొత్తు కాదు. రాజ్ ఠాక్రే ఈ విషయాన్ని గుర్తించాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఠాక్రేకు వ్యతిరేకంగా వెంటనే చర్య తీసుకోవాలి' అని అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడిన తేజస్వి.. గతంలోనూ బిహారీలకు వ్యతిరేకంగా రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు చేశారని, అయినా ఆయనపై బీజేపీ ఎలాంటి చర్య తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆటోరిక్షాల అనుమతులు మరాఠేతరులకే అధికంగా ఇస్తున్నారని రాజ్ ఠాక్రే ఆరోపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 70శాతం ఆటో పర్మిట్లు మరాఠేతరులకే ఉన్నాయని , అలాంటి ఆటోలు రోడ్లపై కనిపిస్తే తన కార్యకర్తలు వాటికి నిప్పుపెట్టడం ఖాయం అని ఆయన హెచ్చరించారు.