‘శివసేన అధినేత బాల్‌ఠాక్రేకు వెన్నుపోటు పొడవలేదు. ఒకవేళ అలాచేసి ఉంటే పెద్దాయన తుదిశ్వాస విడిచే వరకు పార్టీలోకి రావాలని నాతో ఎందుకు సంప్రదింపులు జరిపారు.
సాక్షి, ముంబై: ‘శివసేన అధినేత బాల్‌ఠాక్రేకు వెన్నుపోటు పొడవలేదు. ఒకవేళ అలాచేసి ఉంటే పెద్దాయన తుదిశ్వాస విడిచే వరకు పార్టీలోకి రావాలని నాతో ఎందుకు సంప్రదింపులు జరిపారు. ఇప్పటికైనా ఉద్ధవ్‌ఠాక్రే అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాల’ని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే హెచ్చరించారు. కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గ ఎమ్మెన్నెస్ అభ్యర్థి ప్రమోద్ పాటిల్‌కు మద్దతుగా డోంబివలిలో బుధవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారం రాజ్‌ఠాక్రే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తాను బాల్‌ఠాక్రేకు వెన్నుపోటు పొడిచానని ఒక్కసారి కాదు అనేకసార్లు ఉద్ధవ్ ఆరోపించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బాల్‌ఠాక్రేకు అరోగ్యం బాగా లేనప్పుడు మాతోశ్రీ బంగ్లాకు వెళ్లి భేటీ అయ్యేవాడిని.
ఆయన ఎప్పుడూ నేను వెన్నుపోటు పొడిచినట్లుగా భావించలేదు. మరి ఇన్నాళ్లు ఏమీ మాట్లాడని ఉద్ధవ్‌కు ఆకస్మాత్తుగా నేను వెన్నుపోటు పొడిచానని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమ’ని ఆయన ప్రశ్నించారు. ఆనారోగ్యం బారిన పడిన ఉద్దవ్‌కు బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో అంజియోగ్రఫీ, అంజియో ప్లాస్టీ వైద్య పరీక్షలు జరిగాయని, ఆ తర్వాత శస్త్రచికిత్స పూర్తయ్యేవరకు తాను అక్కడే ఉన్నానని రాజ్‌ఠాక్రే గుర్తు చేశారు. డిశ్చార్జి అయిన తర్వాత ఉద్ధవ్‌ను తీసుకుని స్వయంగా నా కారులో మాతోశ్రీ బంగ్లాలో దింపివచ్చానన్నారు. అప్పుడెందుకు గుర్తుకు రాలేదు, నేను వెన్నుపోటు పొడిచిన వాడి పక్కనే కారులో కూర్చున్నానని అంటూ నిలదీశారు. బాల్‌ఠాక్రే బతికుండగానే ఎమ్మెన్నెస్ స్థాపించానని చెప్పారు. అయితే ఉద్ధవ్ అనారోగ్యానికి గురైనప్పుడు బాల్‌ఠాక్రే తనకే ఎందుకు ఫోన్ కాల్ చేశారు...? అదే గణేశ్ నాయక్, ఛగన్ భుజ్‌బల్, నారాయణ రాణే..ఇలా పార్టీ నుంచి బయటకువెళ్లిన వారిని రమ్మని ఉండవచ్చు కదా అని ప్రశ్నించారు.
అథవలేపై విమర్శలు
తమకు పదువులు వస్తే చాలు అనుయాయుల సమస్యలు పరిష్కారమైనట్లేనని కొందరు భావిస్తున్నారని రాజ్‌ఠాక్రే అన్నారు. అదే బాటలో నడుస్తున్న ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవలే దళితులకు ఎలా నేతృత్వం వహిస్తారని నిలదీశారు. అథవలే రాష్ట్రానికి లాలూప్రసాద్‌లాంటి వారని ఆరోపించారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నోర్లు మూయించాలంటే రాజు పాటిల్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వేపై ప్రభుత్వం టోల్ పెంచి దోచుకోవడం మళ్లీ ప్రారంభించిందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి గడువు పూర్తికాగానే ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సభలో ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యేలు శిశీర్ షిండే, రమేశ్ పాటిల్, ప్రకాశ్ భోయిర్ తదితరులు పాల్గొన్నారు.