ముంబై : లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీసగఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల విజయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారనేది వాస్తవం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయి మెజారిటీతో.. ఏ పార్టీతో కూడా పొత్తు లేకుండా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చిన ఎన్నికలు కూడా ఇవే. ఈ ఎన్నికల విజయానంతరం రాజకీయ విశ్లేషకులు, ప్రతి పక్షాలు సైతం రాహుల్ గాంధీని ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. తొలినాళ్లలో రాహుల్‌ని ‘పప్పు’ అన్న వాళ్లే నేడు రాహుల్ గాంధీ ‘పరిణతి’ సాధించాడని ప్రశంసిస్తున్నారు. ఇలా మెచ్చుకునే వారి కోవలోకి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా చేరారు.
రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లో స్వంతంగా, మధ్యప్రదేశ్‌లో ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘గుజరాత్, కర్ణాటక, ఇప్పుడీ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఒంటరిగా పొరాడారు. అప్పుడు శత్రువులు రాహుల్‌ని పప్పు అన్నారు. కానీ నేటి ఫలితాలు రాహుల్ పప్పు కాదు పరమ పూజ్యుడు అని నిరూపిస్తున్నాయి. అతి త్వరలోనే దేశ రాజకీయాల్లో రాహుల్ నాయకత్వాన్ని మనం చూడబోతున్నాం’ అంటూ రాహుల్ గాంధీని ప్రశంసించారు.
ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే బీజేపీపై విమర్శలు చేశారు. ‘నాలుగున్నరేళ్లలో మోదీ, అమిత్ షా ప్రవర్తనకు నిదర్శనం ఈ ఫలితాలు. వీరు మాటల్లో ఘనం.. చేతల్లో శూన్యం అనే విషయం భారత ప్రజలకు కూడా పూర్తిగా అర్థమయ్యింది. నేడు బీజేపీ ఓటమికి అమిత్ షా, మోదీలే ప్రధాన కారణమంటూ రాజ్ ఠాక్రే ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment