వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పార్టీని తేలిగ్గా తీసుకోవద్దని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పార్టీ కార్యకర్తలకు సూచించారు.
ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పార్టీని తేలిగ్గా తీసుకోవద్దని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. నగరంలో బుధవారం పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌ఠాక్రే పార్టీ ప్రదర్శనను చూస్తే రానున్న ఎన్నికల్లోనూ ఎమ్మెన్నెస్ ప్రభావం ఉంటుందన్నారు. రాజ్‌ఠాక్రే చాలా కష్టాలను ఎదుర్కొంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారని, అలాంటి పార్టీని తేలిగ్గా తీసుకోవద్దని పార్టీ కార్యకర్తలకు హితవు పలికారు. బాల్‌ఠాక్రే నుంచి వారసత్వంగా వచ్చిన శివసేన పార్టీని బలోపేతం చేయడంలో ఉద్దవ్‌ఠాక్రే విఫలమయ్యారని విమర్శించారు. ఇలా పరోక్షంగా ఉద్దవ్ ఠాక్రేను ఎగతాళి చేయగా, రాజ్‌పై ప్రశంసలు గుప్పించారు. రాజ్ ఠాక్రే మహాకూటమికా లేక, నరేంద్ర మోడీకి మద్దతివ్వాలా అనే విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం రాజ్‌ఠాక్రేకే ఉందని చెప్పారు.
మోడీని ఎలా నమ్ముతారు
గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో మరణించిన కాంగ్రెస్ మాజీ ఎంపీ కుటుంబాన్ని కలిసి పరామర్శించని బీజేపే ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రజలు ఎలా నమ్ముతారని పవార్ ప్రశ్నించారు. రాయ్‌గడ్ ఎన్సీపీ అభ్యర్థి సునీల్ తట్కరేకు మద్దతుగా బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహ్మదాబాద్‌కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో జరిగిన అల్లర్లలో కాంగ్రెస్ ఎంపీ సజీవ దహనమయ్యారని, కనీసం మానవత్వం లేని ముఖ్యమంత్రి మోడీ అక్కడికి వెళ్లి ఎంపీ కుటుంబసభ్యులను కూడా పరామర్శించలేదన్నారు. భారత్‌లో ఇప్పటివరకు ఎన్నో ఎన్నికలు జరిగాయని, అందులో ఇప్పటివరకు ఏ ఒక్క ఎన్నికల్లోనూ ప్రధాని మంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించిన దాఖలాలు లేవన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని, కానీ ప్రభుత్వం ఏర్పాటుచేసేంత మెజార్టీ రాదని పవార్ చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 48 లోక్‌సభ స్థానాల్లో ప్రజాస్వామ్య (కాంగ్రెస్, ఎన్సీపీ) కూటమి గెలుస్తుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్దే తమ అభ్యర్థులను గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ బీజేపీలోని సీనియర్ నేతల పట్ల రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటికే జశ్వంత్ సింగ్‌పై వేటు వేసేలా చేశారని ఆయన ఆరోపించారు.