ముంబయి: ‘ఏ దిల్ హై ముష్కిల్’ పంచాయితీ తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దకు చేరింది. పాకిస్తాన్ నటులు నటించిన ఈ చిత్రాన్ని బహిష్కరించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరికల నేపథ్యంలో ఎమ్ఎన్ఎస్ చీఫ్ రాజ్ఠాక్రే, నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్ శనివారం ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ప్రముఖ నిర్మాత ముఖేష్ భట్ కూడా హాజరయ్యారు.
సమావేశం అనంతరం ముఖేష్ భట్ మాట్లాడుతూ భవిష్యత్లో పాకిస్తాన్ నటులతో సినిమాలు తీయమని సీఎంకు హామీ ఇచ్చామన్నారు. అలాగే సినిమా ప్రారంభంలో అమర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ న్యూస్ రీల్‌ను ప్రదర్శించనున్నట్లు కరణ్ జోహార్ ఈ సందర్భంగా ఫడ్నవీస్కు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఎట్టకేలకు ఏ దిల్ హై ముష్కిల్ విడుదలకు లైన్ క్లియర్ అయింది. కాగా దీపావళి సందర్భంగా దిల్ హై ముష్కిల్ చిత్రం ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది.