మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమార్తె ఊర్వశి ఠాక్రే రోడ్డు ప్రమాదానికి గురైంది.
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమార్తె ఊర్వశి ఠాక్రే రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన మహాలక్ష్మి ప్రాంతంలో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ప్రమాదం కారణంగా రాజ్‌ఠాక్రే సోమ, మంగళ, బుధవారాల్లో నిర్వహించాల్సిన తన రాష్ట్ర పర్యటనను వాయిదా వేసుకున్నారు.
పోలీసులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం మహాలక్ష్మి ప్రాంతంలో నివాసముంటున్న స్నేహితురాలింటికి చదువుకునేందుకు ఊర్వశి వెళ్లింది. అర్థరాత్రి దాటిన తర్వాత సరదాగా కొద్దిసేపు తిరిగొద్దామని స్కూటీపై ఇద్దరు బయలు దేరారు. స్నేహితురాలు స్కూటీ నడుపుతుండగా వెనక సీట్లో ఊర్వశి కూర్చింది. మహాలక్ష్మి జంక్షన్ వద్ద వీరి బండి అదుపుతప్పి జారి పడింది. ఈ ఘటనలో వెనక కూర్చున్న ఊర్వశి ఎగిరిపడింది. దీంతో ఆమె కాలు విరిగిపోగా, స్నేహితురాలికి స్వల్ప గాయాలయ్యాయి.
అదృష్టవశాత్తు ఆ సమయంలో వెనక నుంచి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు చెప్పారు. గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు వెంటనే సమీపంలోని జస్లోక్ అస్పత్రికి వారిద్దరినీ తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఊర్వశిని హిందూజా ఆస్పత్రికి తరలించారు. ఆమె కాలికి ఆపరేషన్ చేసినట్లు ఎముకల డాక్టర్ సంజయ్ అగర్వాల్ చెప్పారు. విషయం తెలుసుకున్న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లి ఊర్వశిని పరామర్శించారు.