
నేను పోటీ చేస్తే గుబులెందుకో : రాజ్ ఠాక్రే
శాసనసభ ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించిన నాటి నుంచి ఇతర రాజకీయ నాయకుల్లో గుబులు మొదలైందని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అన్నారు.
సాక్షి, ముంబై: శాసనసభ ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించిన నాటి నుంచి ఇతర రాజకీయ నాయకుల్లో గుబులు మొదలైందని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అన్నారు. ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే ప్రవీణ్ దరేకర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని పుస్తకం రూపంలో అనువదిం చారు. ఆ పుస్తకాన్ని ఆది వారం ముంబైలో అవిష్కరించిన అనంతరం రాజ్ ప్రసంగించారు. తనకు ఫలానా నియోజక వర్గం అంటూ లేదని, యావత్ మహారాష్ట్ర తన కు నియోజక వర్గమన్నారు.
రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటానన్నారు. ఎన్నికలు రాగానే హడావుడి చేయవద్దని పార్టీ పదాధికారులకు, కార్యకర్తలకు హితబోధ చేశారు. అసెంబ్లీలో జరుగుతున్న కార్యకలాపాల విధానాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైన ఉందని అభిప్రాయపడ్డారు. ఇటీవల ప్రకటించిన విధంగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాను ఎక్కడ నుంచి పోటీచేసేది జూలై లేదా ఆగస్టులో ప్రకటిస్తానని రాజ్ అన్నారు.