
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఒకానొక సమయంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేందకు మొగ్గు చూపారన్నారు శివసేన(యూబీటీ) నేత, ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు సంజయ్ రౌత్. ఆ విషయం తనతో పాటు కాంగ్రెస్‌లో కొంతమంది నేతలకు సైతం తెలుసంటూ ఎంపీ సంజయ్ రౌత్ నొక్కి మరీ చెప్పారు.
ఈ క్రమంలోనే దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తో ఏక్‌నాథ్ షిండే బేరసారాలు జరపారన్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి అహ్మద్ పటేల్ మన మధ్య లేరని, ఇంకో సీనియర్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ కు ఈ విషయం తెలుసన్నారు. దీనిపై ఇంతకు మించి తాను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని స్పష్టం చేశారు సంజయ్ రౌత్.
అయితే సంజయ్ రౌత్ కామెంట్లపై పృథ్వీరాజ్ చౌహాన్ ను మీడియా సంప్రదించగా, ఆయన మాట్లాడటానికి నిరాకరించారు. మరొకవైపు ఏక్‌నాథ్ షిండే కూడా అందుబాటులో లేరు. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే ఏక్ నాథ్ షిండ్, పృథ్వీరాజ్ చౌహాన్ లు స్పందిస్తే గానీ క్లారిటీ రాదు.
2౦22లో శివసేన(యూబీటీ) నుంచి ఏక్‌నాథ్ షిండే దూరం కావడంతో పాటు ప్రత్యేక వర్గంతో మహాయుతి కూటమిలో జాయిన్ అయ్యారు. దాంతో శివసేన రెండు ముక్కలైంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు ఏక్‌నాథ్ షిండే సీఎం అయ్యారు. ఆపై 2024లో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో పాటు అందులో బీజేపీకి అత్యధిక సీట్లు రావడంతో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయ్యారు. ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
కొన్ని రోజుల క్రితం ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండేల మధ్య విభేదాలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూరుస్తూ ఏక్‌నాథ్ షిండే మీడియా ముఖంగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు సైతం చేశారు. తన బలమేమిటో కొంతమంది తెలుసుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. తన చరిత్ర ఏమిటో గతాన్ని అడిగితే చెబుతుందంటూ కూటా శివసేనను ముక్కలు చేసిన చరిత్రను చెప్పుకొచ్చారు. ఇదే వార్నింగ్ మహారాష్ట్ర బీజేపీకి కూడా పరోక్షంగా ఇస్తున్నారా? అని ఏక్‌నాథ్ షిండే వ్యాఖ్యల ద్వారా అనుమానం కల్గింది.
Comments
Please login to add a commentAdd a comment