ఒకప్పుడు శరద్ పవార్ వారసుడిగా అజిత్ పవార్‌నే చూసేవారు. పార్టీలో సెకండ్ పొజిషన్‌ను అనుభవించారు. వివాదరహితుగా పేరు తెచ్చుకున్నారు. కొన్నాళ్ల క్రితం బీజేపీలో దూకడానికి అజిత్ పవార్ ఎమ్మెల్యేలతో కలిసి మంతనాలు సాగిస్తుస్నారన్న ఊహాగానాలు వచ్చాయి. ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంటూ ముంబై నగర వీధుల్లో పోస్టర్లు వెలిశాయి. రాజకీయాల్లో తలపండిన శరద్ పవార్ ఇవన్నీ పార్టీకి ముప్పు తెస్తాయని భావించి అత్యంత నాటకీయంగా ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తాను వైదొలుగుతున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.
ఆ తర్వాత కార్యకర్తలు, ఇతర నాయకులు పట్టుబట్టడంతో ఉద్వేగ భరిత వాతావరణంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పార్టీపై ఎప్పటికీ పట్టు తనదేనన్న సంకేతాలను అజిత్ పవార్‌కు పంపారు. ఇది జరిగిన కొద్ది వారాలకే శరద్ పవార్ తన కుమార్తెకే నేరుగా పార్టీ పగ్గాలు అప్పగించి మరో పవర్ గేమ్ మొదలు పెట్టారు. సుప్రియకు పార్టీ బాధ్యతలు అప్పగించడంపై తనకెలాంటి అసంతృప్తి లేదని అజిత్ పవార్ బయటకి చెబుతున్నప్పటికీ ఆయన రాష్ట్రంలో మరో ఏక్‌నాథ్ షిండేలా మారే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది.
అజిత్ పవార్ పార్టీని చీలుస్తారా లేదా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి 53 మంది సభ్యుల బలం ఉంది. అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ కలిసి ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కొనే వ్యూహరచన చేయడంతో శరద్ పవార్ వ్యూహాత్మకంగా అజిత్‌ను బలహీనపరచడం కోసం పటేల్‌కు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే త్వరలోనే అజిత్ పవార్ తీసుకునే నిర్ణయాలు మహారాష్ట రాజకీయాల్లోనే కీలకమైన మార్పులు తీసుకువస్తాయని రాజకీయ విశ్లేషకుడు విజయ్ క్రోమర్ వ్యాఖ్యనించారు.
2019 ఎన్నికల ఫలితాల తర్వాత అజిత్ పవార్ ఎన్సీపీపై చేసిన తిరుగుబాటు విఫలమైంది. బీజేపీ నేత ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పాటైన ప్రభుత్వం మూడు రోజుల్లోనే కూలిపోయిన విష యం తెలిసిందే. కొందరు ఈ ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తూ ముఖ్యమంత్రి కావాలన్న అజిత్ పవార్ కల నెరవేరాలంటే ఎన్సీపీలో ఉంటేనే సాధ్యపడుతుందని, బీజేపీతో చేతులు కలిపితే సాధ్యం కాదన్న విషయం ఆయనకీ తెలుసునని అంటున్నారు. మొత్తమ్మీద అజిత్ పవార్ వేసే అడుగులే ఆయన భవిష్యత్, ఎన్సీపీ భవిష్యత్‌ని నిర్దేశించడంతో పాటు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని కూడా శాసించబోతున్నాయి.
సుప్రియ ఎదుట సవాళ్లు.!
సుప్రియ సూలే గత 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఒక ఎంపీగా ఆమె జాతీయ రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషించారు. అజిత్ పవార్ మాదిరిగా ఆమెకి రాష్ట్ర రాజకీయాల్లో పట్టు లేదు. నాయకత్వ లక్షణాలు కూడా ఇప్పటివరకు ఎక్కడా ప్రదర్శించే అవకాశం రాలేదు. వచ్చే ఏడాది అత్యంత కీలకమైన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టిక్కెట్ల పంపిణీ, పార్టీలో అసమ్మతుల బుజ్జగింపు, ఎన్నికల్లో వ్యూహరచనలు వంటివన్నీ ఆమె ఎలా నిర్వహించగలరనే సందేహాలైతే ఉన్నాయి. సుప్రియ నియామకంతో పార్టీకి ఒక అర్బన్ ఇమేజ్ వచ్చిందేమో కానీ, అజిత్ పవార్ మాదిరిగా గ్రామాల్లోకి చొచ్చుకుపోయి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే సామర్థ్యం లేదు. అయితే తండ్రి మాదిరిగానే సుప్రియకు ఎలాంటి సంక్షోభాన్నయినా తట్టుకునే నిలబడే సామర్థ్యం ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
అజిత్ పవార్ క్రౌడ్ పుల్లర్
అజిత్ పవార్ తన చిన్నాన్న శరద్ పవార్ అడుగు జాడల్లో నడుస్తూ 1982లో తన 20 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. చక్కెర సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గారు. 1991లో తొలిసారిగా ఎన్సీపీ తరఫున బారామతి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత పవార్ కోసం ఆ సీటుని వదులుకొని మహారాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేశారు. అప్పట్నుంచి రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యారు. బారామతి అసెంబ్లీ సీటు నుంచి ఓటమి లేకుండా ఎన్నికవుతూనే ఉన్నారు. 2012, 2014లో ఉప ముఖ్యమంత్రిగా పని చేసి పాలనలోనూ తన సామర్థ్యాన్ని ప్రదర్శించారు. కార్యకర్తల్ని ప్రేమగా పలకరించడం, నాయకులతో మంతనాలు, తాను చెప్పదలచుకున్నదేదో సూటిగా స్పష్టంగా చెప్పడం, గ్రామాల్లో ఉన్న పట్టు వంటివెన్నో ఆయనను క్రౌడ్ పుల్లర్‌గా మార్చాయి.
–సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment