సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రంలో విస్తరణ దిశగా బీఆర్‌ఎస్‌ను పరుగులు పెట్టేంచేలా ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా మహారాష్ట్రలోని ఇతర పార్టీల నుంచి చేరికలపై దృష్టి సారించారు. ఇప్పటికే మహారాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాల నుంచి వివిధ పారీ్టల మాజీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో శరద్‌పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ), శివసేన(థాక్రే, షిండే) వర్గాల్లో నెలకొన్న పరిస్థితిని అనువుగా మలుచుకుని చేరికల జోరు పెంచాలని భావిస్తున్నారు.
ఇప్పటివరకు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన అభ్యర్థులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఎన్‌సీపీకి చెందిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఎన్‌సీపీ ముఖ్యనేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు మూడురోజుల క్రితం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ఎంపీ ఎన్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల చేరిక వ్యవహారంలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ఎన్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల చేరిక ఖాయమైన తర్వాత మహారాష్ట్రలో మరో భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. పొంగులేటి కొత్త పార్టీ?
‘మహా’పాలిటిక్స్‌పై కేసీఆర్ లెక్కలు
మహారాష్ట్ర రాజకీయాలు బీఆర్‌ఎస్ విస్తరణకు అనుకూలంగా ఉన్నాయనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాలు, పార్టీల సంస్థాగత లోపాలను అనువుగా మలుచుకుని బీఆర్‌ఎస్ బలోపేతానికి కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఎన్‌సీపీ, శివసేన(థాక్రే, షిండే) వర్గాల్లో నెలకొన్న పరిస్థితి బీఆర్‌ఎస్ విస్తరణకు అనుకూలంగా ఉందనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లోకి వలసలను ప్రోత్సహించేలా కార్యాచరణకు పదును పెడుతున్నారు. ఈ నెల 2న తెలంగాణ భవన్‌లో మహారాష్ట్ర నేతలతో జరిగిన భేటీలో బీఆర్‌ఎస్ సిద్ధాంతాలు, లక్ష్యాలను వివరించడంతోపాటు చేరికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి అనేక అంశాలపై చర్చించారు.
మహారాష్ట్రకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తనతో టచ్‌లో ఉన్నారనే విషయాన్ని వెల్లడించారు. ఎన్‌సీపీ అధ్యక్ష పదవికి శరద్‌పవార్ రాజీనామా ప్రకటన, తర్వాత వెనక్కి తీసుకోవడం వంటి పరిణామాలు వేగంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్‌సీపీలో మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎంపీ సుప్రియా సూలే మధ్య ఆధిపత్యపోరుతో పార్టీలో చీలిక అనివార్యమనే అంశాన్ని అక్కడి నేతలు కేసీఆర్ దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. ఎన్‌సీపీకి 50కిపైగా మంది శాసనసభ్యులు ఉండగా, ఇందులో మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్‌పవార్ వర్గంలో ఉన్నట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న సందిగ్ధ పరిస్థితుల్లో కొందరు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. శివసేన రెండువర్గాల నేతలు కూడా కేసీఆర్‌కు టచ్‌లోకి వచ్చినట్లు మహారాష్ట్ర రాజకీయాలను బీఆర్‌ఎస్ తరఫున పర్యవేక్షిస్తున్న నేత ఒకరు వెల్లడించారు.
ఇప్పటికే పలువురు మాజీల చేరిక
నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాలకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు అన్నాసాహెబ్ మానే, హర్షవర్దన్ జాదవ్, శంకరన్న దోంగ్డె, రాజు తొడ్సమ్ గులాబీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు ఔరంగాబాద్ జెడ్పీ చైర్మన్, గత ఎన్నికల్లో పోటీ చేసిన సంతోష్ కుమార్ వంటి నేతలు కూడా బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల రాకతో చేరికల వేగం మరింత పెరుగుతుందని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ మోడల్‌పై చర్చకు షిండే హామీ..
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను మహారాష్ట్రలోనూ అమలు చేయాలని వినాయక్ పాటిల్ అనే మహారాష్ట్రవాసి ఐదురోజులుగా ఆమరణదీక్ష చేస్తున్నారు. వినాయక్ పాటిల్ అరోగ్యం విషమించడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఫోన్ చేశారు. మే 9న తెలంగాణలో అమలవుతున్న పథకాలు, తెలంగాణ మోడల్‌పై చర్చిద్దామని సీఎం షిండే హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: నా గొంతులో ప్రాణమున్నంత వరకు రామన్న చెయ్యి వదిలేది లేదు.. తెలంగాణ జాతిపితకే జీవితం అంకితం
Comments
Please login to add a commentAdd a comment