బెంగళూరు: మహారాష్ట్ర రాజకీయాల్లో తలెత్తిన అనూహ్య పరిణామాలపై బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ హడావిడిగా ప్రమాణం చేయడం వెనుక పెద్ద డ్రామా దాగి ఉందని, మహారాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోని రూ. 40వేల కోట్ల కేంద్ర నిధులను కాపాడి.. తిరిగి కేంద్రానికి అప్పగించేందుకే ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణం చేశారంటూ విస్మయపరిచే వ్యాఖ్యలు గుప్పించారు.
నిత్యం వివాదాల్లో ఉండే ఈ కర్ణాటక ఎంపీ.. శనివారం తన నియోజకవర్గం ఉత్తర కన్నడలోని యెల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర నిధులను సురక్షితంగా మళ్లీ కేంద్రానికి చేర్చడానికి ఫడ్నవిస్‌కు 15 గంటల సమయం పట్టిందని చెప్పుకొచ్చారు.
‘మహారాష్ట్రలో మా పార్టీ వ్యక్తి కేవలం 80 గంటలు మాత్రమే సీఎంగా ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఫడ్నవిస్ రాజీనామా చేశారు. మేం ఎందుకీ డ్రామాను చేయాల్సి వచ్చింది? మాకు తెలియదా? మెజారిటీ లేదని మాకు తెలిసినా.. ఆయన ఎందుకు సీఎం అయ్యారు? ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నలను అడుగుతున్నారు. దీనికి కారణం రూ. 40వేల కోట్లే. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమి అధికారంలోకి వస్తే ఈ 40వేల కోట్లు అభివృద్ధి పనుల కోసం కాకుండా దుర్వినియోగమయ్యేవి. అందుకే పక్కా ప్లానింగ్‌తో ఏదైతే అదయిందని పెద్ద డ్రామాకు తెరతీశాం. అందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 15 గంటల్లో ఫడ్నవిస్ డబ్బులు తిరిగి సురక్షితంగా ఉండోచోటుకు పంపించారు. అవి కేంద్రానికి వెళ్లిపోయాయి. అవి ఉన్నచోటే ఉంటే తదుపరి సీఎం ఆ నిధులను ఏం చేసేవారో మనందరికీ తెలిసిందే’ అని అనంత్‌కుమార్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు ఇటు బీజేపీని, అటు ఫడ్నవిస్‌ను ఇరకాటంలోకి నెట్టేశాయి. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ అలాంటిదేమీ లేదని తెలిపారు. ‘అలాంటిదేమీ జరగలేదు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా తప్పు. రెండోసారి సీఎంగా ఉన్నప్పుడు నేను ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోలేదు. నిజానికి ఇలా జరగడానికి ఆస్కారం లేదు. కావాలంటే ప్రభుత్వ ఆర్థిక విభాగం ఈ అంశంపై దర్యాప్తు చేపట్టవచ్చు’అని ఫడ్నవిస్ స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment