రెబల్ ఎమ్మెల్యేలతో బుధవారం ర్యాలీ నిర్వహించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. ఎన్సీపీ అధినేత, సొంత బాబాయ్ శరద్ పవార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీకు 83 ఏళ్ల వయసొచ్చింది.. రిటైర్ అయిపోయి.. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలంటూ వేదిక నుంచి ఎన్సీపీ సుప్రీంకు చురకలటించారాయన. అలాగే.. గతంలో బీజేపీతో జట్టు కట్టేందుకు శరద్ పవార్ ప్రయత్నించారని, పార్టీ చీఫ్ పదవికి రాజీనామా పేరుతో డ్రామాలు ఆడారంటూ సంచలన వ్యాఖ్యలే చేశారాయన.
ఉద్దవ్ థాక్రే వైఖరిపై అసంతృప్తితో ఏక్‌నాథ్ షిండే బీజేపీతో జట్టు కట్టే సమయంలో.. పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా బీజేపీ వైపే మొగ్గు చూపించారు. అంతేకాదు సంతకాల సేకరణ కూడా జరిగింది. మా వైఖరికి మద్దతు ప్రకటించాలని, లేకుంటే నియోజకవర్గాల్లో సమస్యలు వస్తాయని శరద్ పవార్ దృష్టికి తీసుకెళ్లాం. జయంత్ పాటిల్, నేను కలిసి ఈ మేరకు బీజేపీతో చర్చించేందుకు ముందుకు వచ్చాం కూడా. ఆ సమయంలో ఆయన(శరద్ పవార్‌ను ఉద్దేశించి) ఏం చేసినా మీడియా కంట పడకూడదని చెప్పారు. ఏదైనా ఉంటే బీజేపీ వాళ్లతో ఫోన్‌లో మాట్లాడమని సూచించారు. అప్పటికీ ఏక్‌నాథ్ షిండే ఇంకా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయలేదు.
ఎందుకు మాట మార్చారో తెలీదు
2019లో సమయంలోనే ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్సీపీ ఐదుసార్లు బీజేపీతో భేటీ అయ్యిందని అజిత్ పవార్ అన్నారు. కానీ, ఏం జరిగిందో తెలియదు. హఠాత్తుగా బీజేపీతో పొత్తు లేదని.. శివసేనతో ముందుకు వెళ్తున్నామని నాకు చెప్పారు. కారణం ఏంటో కూడా నాకు తెలియదు. శరద్ పవార్ వెంట ఇప్పుడున్న వాళ్లు.. 2017లో శివసేనను కులపిచ్చి పార్టీ అన్నారు. కానీ, 2019లో వాళ్లతోనే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అలాంటిది ఇప్పుడు నన్నెందుకు విలన్‌ను చేస్తున్నారో అర్థం కావడం లేదు. అయినా మీరంటే నాకు గౌరవం ఉంది అంటూ శరద్ పవార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు అజిత్ పవార్.
#WATCH | Maharashtra Deputy CM Ajit Pawar says, "You portrayed me as a villain in front of everyone. I still have deep respect for him (Sharad Pawar)...But you tell me, IAS officers retire at 60...even in politics
— ANI (@ANI) July 5, 2023
- BJP leaders retire at 75. You can see the example of LK Advani… pic.twitter.com/T2XqCzEH89
ఆ డ్రామా ఎందుకు?
ఒక ఐఏఎస్ అధికారి 60 ఏళ్లకు రిటైర్ అవుతాడు. ఇతర పార్టీల్లో నేతలకు రిటైర్‌మెంట్ వయసు ఉంటుంది. బీజేపీనే అందుకు ఉదాహరణగా తీసుకోండి. 75 ఏళ్లు రాగానే అద్వానీ, మురళి మనోహర్ జోషి లాంటి వాళ్లు పక్కకు తప్పుకున్నారు. అప్పుడే కదా కొత్త తరానికి అవకాశం దొరికేది. మరి ఎన్సీపీలో కొత్తవాళ్లకు అవకాశం ఉండదా?. మేం ఏమైనా తప్పు చేసి ఉంటే.. మాకు చెప్పండి సరిదిద్దుకుంటాం. మీ వయసు ఇప్పుడు 83 ఏళ్లు. ఇక రిటైర్ అవ్వారా? మాకు మీ ఆశీస్సులు ఇవ్వరా?.. మేం మీరు ఆయురారోగ్యాలో ఉండాలని ప్రార్థిస్తున్నాం అంటూ బాబాయ్ శరద్ పవార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అంతేకాదు.. తాజాగా శరద్ పవార్ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేయడం.. వెంటనే వెనక్కి తీసుకున్న వ్యవహారంపైనా అజిత్ పవార్ సెటైర్లు వేశారు.
ఆ సమయంలో ఆయన సుప్రియా సూలేను జాతీయ అధ్యక్షురాలిగా ప్రకటించాలనుకున్నారు. అది మాకు అర్థమైంది. దానికి మేం సిద్ధంగా ఉన్నాం కూడా. వెనక్కి తీసుకునే ఉద్దేశమే ఉంటే రాజీనామా చేయడం ఎందుకని నిలదీశారాయన. ఇక తన సోదరి, ఎంపీ సుప్రియా సూలేకు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పజెప్పడంపైనా అజిత్ పవార్ పరోక్షంగా స్పందించారు. పవర్‌ఫుల్ ఫ్యామిలీలో పుట్టకపోవడం మా తప్పా? అంటూ వ్యాఖ్యానించారాయన.
ఏదో ఒక రోజు సీఎం అవ్వాలని..
ఎన్సీపీ తిరుగుబాటు నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన మనసులో మాట బయటపెట్టారు. ఏదోఒకరోజు మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అవ్వాలన్నదే తన కోరికని.. అది నెరవేర్చుకుని తీరతానని అన్నారాయన. 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలలో 40 మందితో పాటు ఎమ్మెల్సీల మద్దతు కూడా తనకు ఉందని అంటున్నారాయన.
ఇదిలా ఉంటే.. ఎన్సీపీ సంక్షోభం కేంద్ర ఎన్నికల సంఘాన్ని చేరింది. శరద్ పవార్ తానే ఎన్సీపీని నడిపిస్తానని చెబుతుండగా.. అజితపవార్ నేతృత్వంలోని రెబల్ గ్రూప్ మాత్రం పార్టీ పేరు, గుర్తు కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిచింది. మరోవైపు శరద్ పవార్ వర్గం తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు లేఖ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment