అరెస్ట్ సందర్భంగా నినదిస్తున్న మాలిక్
ముంబై: మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి, ఎన్‌సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను అక్రమార్జన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్టు చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా మాలిక్‌ను అరెస్టు చేశారు. దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయానికి బుధవారం ఉదయం 8 గంటలకు మాలిక్‌ను తీసుకువచ్చిన ఈడీ అధికారులు ఆయన్ను దాదాపు 6 గంటలు ప్రశ్నించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కస్టడీలోకి తీసుకొని బందోబస్తుతో వైద్య పరీక్షలకు పంపారు.
పీఎంఎల్‌ఏ (అక్రమార్జన నిరోధక చట్టం) కింద మాలిక్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామని, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని ఈడీ అధికారులు చెప్పారు. మాలిక్‌ను ప్రత్యేక కోర్టు ముందు హాజరు పరిచారు. ఆయనకు ప్రత్యేక కోర్టు వచ్చేనెల 3వరకు ఈడీ కస్టడీ విధించింది. అనంతరం ఈడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. దావూద్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన ఒక ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మాలిక్‌పై కేసు నమోదు చేసింది. ముంబై దాడులతో సంబంధమున్నవారితో మాలిక్‌కు స్థిరాస్తి సంబంధాలున్నాయని, అందువల్ల ఆయన్ను ప్రశ్నించాల్సి ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది.
అఘాడీలో ఆందోళన
నవాబ్ మాలిక్ అరెస్టుతో అధికార మహా అఘాడీ కూటమిలో కలకలం రేగింది. ఎన్‌సీపీకి చెందిన మంత్రులు అజిత్ పవార్, ఛగన్ భుజ్‌బల్, హసన్ ముషరిఫ్, రాజేశ్ తోపె తదితరులు అధినేత శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. మాలిక్ అరెస్టు తర్వాత పరిణామాలపై చర్చలు జరిపారు. మాలిక్ రాజీనామా చేస్తే ఆయన పోర్టుఫోలియోలను ఎవరికివ్వాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం మాలిక్ మైనార్టీ, నైపుణ్యాభివృద్ధి శాఖలకు మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బాలాసాహెబ్, అశోక్, సునీల్ శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కొందరు కుట్రపన్నుతున్నారని ఈ సందర్భంగా కూటమి నేతలు ఆరోపించారు. గతేడాది మాలిక్ అల్లుడు సమీర్‌ను డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ అరెస్టు చేసింది.
అప్పటి కేసు
ఈ నెల 15న ముంబైలో దావూద్ హవాలా లావాదేవీలతో సంబంధం ఉందంటూ దావూద్ సోదరి, సోదరుడు, చోటా షకీల్ బావమరిది సహా పలువురికి సంబంధించిన ఇళ్లపై ఈడీ రైడింగ్‌లు జరిపి కేసు నమోదు చేసింది. గతంలో దావూద్ తదితరులపై ఎన్‌ఐఏ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అంశాల ఆధారంగా ఈడీ దాడులు నిర్వహించింది. 2005లో ముంబైలోని కుర్లా ప్రాంతంలోని రూ.300 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రూ.55 లక్షలకే మాలిక్ పొందాడని ఈడీ తెలిపింది. ఇందులో ఆయనకు దావూద్ సోదరి హసీనా పార్కర్‌తో పాటు దావూద్ సన్నిహితులు సాయం చేశారని తెలిపింది. దావూద్‌తో మాలిక్‌కు సంబంధం ఉందన్న ఆధారాల్లేవని మాలిక్ న్యాయవాదులు చెప్పారు. ఈడీ చెబుతున్న లావాదేవీ 1999కి సంబంధించినదని తెలిపారు. 2.86 ఎకరాల భూమిన కారుచౌకగా మాలిక్ దక్కించుకున్నారని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు.
కక్షపూరిత చర్య: ఎన్‌సీపీ
కొందరు చేసిన తప్పులు బయటపెడుతున్నందుకే నవాబ్ మాలిక్‌ను కేంద్రం అరెస్టు చేయించిందని, కేంద్ర అధికార దుర్వినియోగానికి ఈ అరెస్టు నిదర్శనమని ఎన్‌సీపీ విమర్శించింది. ఇలాంటి రాజకీయ కుట్రలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేస్తామని శివసేన, కాంగ్రెస్ ప్రకటించాయి. మహారాష్ట్రలో ఎన్‌సీపీతో కలిసి శివసేన, కాంగ్రెస్ మహా అఘాడీ కూటమి పేరిట అధికారంలో ఉన్నాయి. కేంద్ర ఏజెన్సీలు మాఫియాలాగా బీజేపీ వ్యతిరేకులను టార్గెట్ చేస్తున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. 2024 వరకు ఈ ధోరణి కొనసాగుతుందని, తర్వాత వారు ఇంతకు ఇంత అనుభవిస్తారని హెచ్చరించారు.
అండర్‌వరల్డ్‌తో సంబంధం లేని ఒక ముస్లిం యాక్టివిస్టును అరెస్టు చేయాలంటే దావూద్ పేరు తీసుకువస్తారని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ కేంద్రాన్ని దుయ్యబట్టారు. సదరు కేసు నమోదై 25ఏళ్లు గడిచిపోయాయని, కానీ ఇప్పటికీ తమ వ్యతిరేకులను ఇబ్బంది పెట్టేందుకు ఆ కేసులో పేర్లను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. మాలిక్ అరెస్టును నిరసిస్తూ ఎన్‌సీపీ కార్యకర్తలు ఈడీ ఆఫీసుకు దగ్గర్లోని ఎన్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అరెస్టైన మాలిక్‌కు మంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని, రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ డిమాండ్ చేశారు. మాలిక్ అరెస్టును టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment