ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ తనను ప్రతిపక్ష నాయకుడి పాత్ర నుండి తప్పించమని పార్టీ అధిష్టానాన్ని కోరిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిస్పందిస్తూ ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లో ఒకరైన సుప్రియా సూలే ఆయనకు ఎలా కావాలంటే అలా చేద్దాం కానీ అది నా చేతుల్లో లేదు, పార్టీ నిర్ణయించాలని అన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్సీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను నియమించారు ఆ పార్టీ సీనియర్ నేత శరద్ పవార్. అదే సమయంలో పార్టీ తరపున ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహిస్తోన్న అజిత్ పవార్ ను నిర్లక్ష్యం చేశారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే ఆరోజునే ఈ విషయాన్ని సూటిగా ప్రశ్నించగా నేను సంతృప్తికరంగానే ఉన్నానని, ఇప్పటికే నాపై అనేక బాధ్యతలు ఉన్నాయని చెప్పిన ఆయన మెల్లగా అలగడం ప్రారంభించారు.
ప్రతిపక్ష నాయకుడిగా పనిచేయాలన్న కోరిక నాకు లేదు. పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారని నేనా బాధ్యతలను స్వీకరించాను. కానీ ప్రస్తుతానికైతే నన్ను ప్రతిపక్ష నాయకుడిగా తప్పించి మరేదైనా బాధ్యతను అప్పగిస్తే పూర్తి స్థాయి న్యాయం చేయగలుగుతానని పార్టీ అధిష్టానాన్ని కోరారు.
దీనిపై స్పందిస్తూ ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే.. ఆయన ఎలా కోరితే అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాకపోతే అది నా ఒక్కరి చేతుల్లో లేదు. పార్టీ కార్యవర్గం అంతా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఒక సోదరిగా ఆయన ఏది కోరితే అది జరగాలనే కోరుకుంటానని అన్నారు.
ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన అమిత్ షా
Comments
Please login to add a commentAdd a comment