సాక్షి, ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన తదుపరి చీఫ్‌గా ఎవరు నియమిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఐతే తదుపరి వారుసుడిని ఎంపిక చేసేందుకు పవార్ ఏర్పాటు చేసిన కమిటీ ముంబైలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం అవుతుందని ఎన్పీపీ వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ సభ్యుల్లో కమిటీ సభ్యుల్లో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఆయన మేనల్లుడు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ తదితరులు ఉన్నారు.
ఐతే పార్టీ జాతీయాధ్యక్షుడిగా పవార్ స్థానంలో కూతురు సుప్రియా సూలే ముందున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర చీఫ్‌గా అజిత్ పవార్ ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు చగ్గన్ భుజ్‌బల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఇష్టపడినట్లయితే.. అజిత్ పవార్ రాష్ట్రాన్ని చూసుకుంటారని, సుప్రియా సూలే జాతీయ రాజకీయాలను చూసుకుంటారని చెప్పారు.
అలాగే పార్టీ మద్దతుదారులు, కార్యకర్తల విజ్ఞప్తుల మేరకు పవార్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవడానికి అంగీకరించారని ఎన్సీపీ పార్టీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ చెప్పడం విశేషం. అంతేగాదు శరద్ పవార్ పదవికి రాజీనామా చేసే ప్రకటనపై తుది నిర్ణయం వెలువడేంత వరకు ఆయన వారసుడిగా పార్టీ చీఫ్‌ని ఎంపిక చేసే ప్రశ్నే లేదని పటేల్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పవార్ నిర్ణయానికి నిరసనగా పార్టీ నేతలు మూకుమ్ముడిగా రాజీనామాలు చేయడం మానుకోవాలని అన్నారు. పార్టీ పవార్ నిర్ణయాన్ని మార్చుకునేలా ఒప్పించేందుకు యత్నిస్తోంది, కాబట్టి కార్యకర్తలంతా కొంచెం ఓపిక పట్టాలని చెప్పారు.
ఇదిలా ఉండగా..అజిత్ పవార్ పార్టీని చీల్చి, అధినేతగా బాధ్యతలు చేపట్టాలని యోచిస్తున్నారనే ఊహాగానాల మధ్య శరద్ పవార్ ఈ అనూహ్య చర్య తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలో తిరుగుబాటు తలెత్తకుండా ఉండేలా ఎన్సీపీ సీనియర్ నాయకుడు శరద్ పవార్ వేసిన ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాగా, శరద్ పవార్ మాత్రం కొత్తతరం పార్టీకి మార్గనిర్దేశం చేయాల్సిన సమయం ఆసన్నమైందని , అత్యాశ ఉండకూదని చెబుతూ..జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.
(చదవండి: శరద్ పవార్ ఆత్మకథలో ఆసక్తికర విషయం.. మోదీకి అప్పుడే చెప్పా అది కుదరని!)
Comments
Please login to add a commentAdd a comment