
అన్న కొడుకు అజిత్ పవార్‌కు షాక్ ఇచ్చారు NCP అధినేత శరద్ పవార్. కూతురు సుప్రియా సూలేకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. అజిత్ను పక్కనపెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి..? జూనియవ్ పవార్ ఏం చేయబోతున్నారు..?
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. NCPకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. కూతురు, ఎంపీ సుప్రియా సూలే, సీనియర్ నేత ప్రఫుల్ పటేళ్లకు కార్యనిర్వహక అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు శరద్ పవార్. అయితే పార్టీ వ్యవహారాల విషయంలో అన్న కొడుకు, ముఖ్యనేత అజిత్ పవార్‌ను పక్కన పెట్టడం హాట్‌టాపిక్‌గా మారింది.
వర్కింగ్ ప్రెసిడెంట్గా సుప్రియా సూలేకు మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్, విమెన్ యూత్, లోక్సభ కోఆర్డినేషన్ బాధ్యతలను అప్పగించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా వ్యవహారాలు, NCP రాజ్యసభ ఎంపీలను పర్యవేక్షించనున్నారు ప్రఫుల్ పటేల్.
ఎన్సీపీ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో.. వర్కింగ్ ప్రెసిడెంట్స్ పేర్లను ప్రకటించారు శరద్ పవార్. ఈ కార్యక్రమానికి అజిత్ పవార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ప్రకటన వెలువడింది. కానీ ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామాలపై ట్విట్టర్లో స్పందించిన అజిత్ పవార్.. నూతనంగా ఎన్నికైన వర్కింగ్ ప్రెసిడెంట్లకు శుభాకాంక్షలు తెలిపారు.
అజిత్ పవార్ బీజేపీకి దగ్గరవుతున్నారంటూ గతకొంతకాలంగా పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో NCP అధ్యక్ష పదవికి రాజీనామా చేసి అందరికీ షాక్ ఇచ్చారు శరద్ పవార్. పార్టీ నేతలు, కార్యకర్తల విజ్ఞప్తితో వెనక్కి తగ్గారు. అప్పుడే పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించేందుకు కమిటీ ఏర్పాటుచేయాలనే తీర్మానం జరిగింది. దీంతో అజిత్ పవార్‌కు రాష్ట్ర పార్టీ బాద్యతలు అప్పగిస్తారని, సుప్రియా సూలే జాతీయ రాజకీయాలు పర్యవేక్షిస్తారనే వార్తలు వినిపించాయి. కానీ, అనూహ్యంగా అజిత్ పవార్‌ను పక్కనపెట్టడం చర్చనీయాంశం అయ్యింది. పవార్ బంధుప్రీతి అంటూ బీజేపీ విమర్శలు గుప్పించగా.. అజిత్ పవార్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment