ముంబై: ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమ పార్టీ గుర్తు ఎవరికీ ధారాదత్తం చేసేది లేదని పార్టీ గుర్తు మా వద్దే ఉంటుందని తేల్చి చెప్పారు.
నాగ్‌పూర్‌లో జరిగిన ఓ సమావేశం అనంతరం ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ తెలుసు ఎన్సీపీ అంటే శరద్ పవార్.. శరద్ పవార్ అంటే ఎన్సీపీ అని. అలాగే మహారాష్ట్రలో ఎన్సీపీ అంటే జయంత్ పాటిల్ అని కూడా అందరికీ తెలుసన్నారు. 25 ఏళ్ల క్రితం శరద్ పవార్ ఎన్సీపీ పార్టీని స్థాపించారని ఈ పార్టీ గుర్తు ఎప్పటికీ ఆయనతోనే ఉంటుందని ఎవరికీ ఇచ్చేది లేదన్నారు.
ఈ ఏడాది జులై ప్రారంభంలో ఎన్సీపీలో చీలిక తీసుకొస్తూ అజిత్ పవార్ అధికార బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపిన విషయం తెలిసిందే. కానీ ఆయన అంతకుముందే జూన్ 30న ఎన్సీపీ పార్టీ తనదేనంటూ ఆ గుర్తు తమ వర్గానికే కేటాయించాల్సిందిగా కోరుతూ ఎలక్షన్ కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. అజిత్ పవార్ సమర్పించిన పిటిషన్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీల అఫిడవిట్‌లు కూడా ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. దీంతో ఎన్నికల కమిషన్ కూడా పార్టీలో చీలిక వచ్చిందన్న విషయాన్ని అంగీకరిస్తూ అక్టోబర్ 6న విచారణకు హాజరు కావాల్సిందిగా ఇరుపక్షాలకు నోటీసులిచ్చింది.
ఇది కూడా చదవండి: పొత్తుల విషయంలో మాయావతి కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment