ఫడ్నవిస్‌కు పుష్పగుచ్ఛమిస్తున్న అజిత్ పవార్. చిత్రంలో ప్రఫుల్ పటేల్, ఛగన్ బుజ్‌బల్, సునీల్ తత్కారే
ముంబై/సతారా: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పారీ్ట (ఎన్సీపీ)పై ఆధిపత్యం కోసం అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అజిత్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శరద్ పవార్ వర్గం, శరద్ వర్గం ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని అజిత్ వర్గం పట్టుబడుతున్నాయి. శరద్ వర్గం నాయకులను పార్టీ పదవుల నుంచి అజిత్ వర్గం తొలగించింది. అసెంబ్లీలో ఎన్సీపీ పక్షనేతగా అజిత్ పవార్ నియమితులైనట్లు ఆయన వర్గం చెబుతోంది.
ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్ పవార్‌తోపాటు మంత్రులుగా ప్రమాణం చేసిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఎన్సీపీ అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు ఫిర్యాదు చేసింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం 9 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా తేల్చడానికి తగిన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. శరద్ పవార్ వర్గం నేత జితేంత్ర అవద్ ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ మేరకు స్పీకర్‌కు విజ్ఞాపన అందించారు.
ఇదిలా ఉండగా, అజిత్ పవార్‌తో సహా 9 మంది ఎమ్మెల్యేలకు శరద్ పవార్ వర్గం సోమవారం నోటీసులు జారీ చేసింది. ఎన్సీపీతో వారికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఇక ఏ వేదికపైనా ఎన్సీపీ ప్రతినిధులుగా చెప్పుకోవద్దని వారికి తేల్చిచెప్పింది. పార్టీని ధిక్కరించి బయటకు వెళ్లిపోయిన వారు పార్టీ నేతలమని చెప్పుకోవడం చట్టవ్యతిరేకం అవుతుందని ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ స్పష్టం చేశారు. 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయడానికి వీలుగా ఎన్సీపీ క్రమశిక్షణా కమిటీ ఇప్పటికే ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్సీపీ ఫిర్యాదు తగిన నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ చెప్పారు. పవార్‌కు ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నదీ తనకు తెలియదన్నారు.
పటేల్, తత్కారే బహిష్కరణ
కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, లోక్‌సభ సభ్యుడు సునీల్ తత్కారేను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోమవారం తమ పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వారిపై ఈ మేరకు చర్య తీసుకున్నట్లు ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇక మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడిగా లోక్‌సభ సభ్యుడు సునీల్ తత్కారేను నియమించినట్లు ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. అసెంబ్లీలో ఎన్సీపీ పక్ష నేతగా అజిత్ వ్యవహరిస్తారని అన్నారు. గరిష్ట సంఖ్యలో ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్ అన్నారు.
అజిత్ కు బీజేపీ సీఎం పదవి ఎర: కాంగ్రెస్
అజిత్‌కు సీఎం పదవి కట్టబెడతామని బీజేపీ హామీ ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ‘‘బీజేపీ–శివసేన ప్రభుత్వంలో అజిత్ చేరుతారని ఎప్పుడో తెలుసు. 16 మంది సేన(షిండే) ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించి షిండేను సీఎం పదవి నుంచి దింపేస్తారు. అజిత్‌ను కూచోబెడతారు’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. శివసేన (ఉద్ధవ్) పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలోనూ ఇదే విషయం రాసింది.
అజిత్ తిరుగుబాటు వెనుక నా ప్రమేయం లేదు: పవార్
తన ఆశీస్సులతోనే అజిత్ పవార్ తిరుగుబాటు చేశారంటూ వినిపిస్తున్న వాదనలను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఖండించారు. బీజేపీ–శివసేన ప్రభుత్వంలో అజిత్ చేరడం వెనుక తన ప్రమేయం ఎంతమాత్రం లేదన్నారు. ఆయన సోమవారం సతారా జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీ బలోపేతం కోసం ప్రజల్లోకి వెళ్తానని, రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment