ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే తాను రాజకీయాలకు పనికిరానంటూ రాజీనామా చేశారు. బీద్ జిల్లా మజల్‌గాన్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సోలంకే సోమవారం రాత్రి అనూహ్యంగా ఈ ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఈ మంత్రి వర్గ విస్తరణలో ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఆయనతో పాటుగా 36 మంది కొత్త మంత్రులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీల నుంచి పలువురికి మంత్రి పదవులు లభించగా ఆశించిన వారికి మాత్రం ఫలితం దక్కలేదు.
చదవండి: 'సీడీఎస్‌గా భవిష్యత్ వ్యూహాలు రచిస్తా: బిపిన్ రావత్'
ఈ సందర్భంగా ప్రకాష్ సోలంకే మాట్లాడుతూ.. మంగళవారం నేను నా రాజీనామా సమర్పించనున్నాను. ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్న. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న నా నిర్ణయాన్ని ఇప్పటికే ఎన్సీపీ అధీష్టానానికి తెలియజేశాను. మంగళవారం సాయంత్రం ముంబైలో అసెంబ్లీ స్పీకర్‌ని కలిసి రాజీనామా లేఖను అందిస్తాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి వర్గ విస్తరణ తర్వాత తాను రాజకీయాలకు పనికిరానంటూ రుజువైందని ప్రకాశ్ సోలంకే పేర్కొనడం గమనార్హం. మహారాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 288 స్థానాలకు గానూ ఎన్సీపీకి 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్సీపీ చాలా కీలకంగా ఉంది. ఈ తరుణంలో ఆయన రాజీనామా చేయడంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment