షూటర్లకు ఫొటో, ఫ్లెక్సీ అందజేత
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్దిఖీని కాల్చిచంపడానికి పుణెలో కుట్ర జరిగిందని పోలీసులు సోమవారం వెల్లడించారు. íసిద్దిఖీని గుర్తించడానికి వీలుగా ఆయన ఫొటో, చిత్రం ముద్రించిన ఫ్లెక్సీని షూటర్లకు అందజేశారు. ఈ హత్యలో పుణెకు చెందిన సోదరులు ప్రవీణ్ లోంకర్, శుభమ్ లోంకర్‌ల పాత్ర ఉందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. నిందితులు దొరకితే హత్యకు కారణాలు తెలుస్తాయని ఒక పోలీసు అధికారి తెలిపారు.
లోంకర్ సోదరులే హత్యకు పాల్పడిన షూటర్లకు రూ.50 వేల చొప్పున అడ్వాన్సు అందించారని, నిందితుల మధ్య సమావేశాలను ఏర్పాటు చేశారని, హత్యకు కావాల్సిన ఏర్పాట్లను చూశారని చెప్పారు. శుభమ్‌కు చెందిన డైరీలో ప్రవీణ్ పనిచేస్తున్నాడని.. అక్కడే షూటర్లు శివకుమార్ గౌతమ్, ధర్మరాజ్ కశ్యప్‌లను హత్య కోసం నియమించుకున్నారని తెలిపారు. అడ్వాన్సుగా అందిన మొత్తం నుంచి నిందితులు ఒక మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసి.. దాని పైనే సిద్దిఖీ నివాసం, ఆఫీసుల వద్ద, ఆయన దినచర్య పైనా రెక్కీ నిర్వహించారని వివరించారు. గుర్మైల్ బల్జీత్‌సింగ్ (హరియాణా), ధర్మరాజ్ కశ్యప్ (ఉత్తరప్రదేశ్), ప్రవీణ్ లోంకర్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితులకు దిశానిర్దేశం చేసిన మొహమ్మద్ యాసిన్ అక్తర్ కోసం. సిద్దిఖీని కాల్చిచంపిన గౌతమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment